Headlines

Hyderabad: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు.. ఇవి పాటించకపోతే.. | Ganesh Festival: Attapur Police Step Up Vigil, Issue Strict Warning to Rowdy Sheeters


గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అత్తాపూర్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలోని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం 72 మంది రౌడీ షీటర్లు ఉండగా వీరిలో దాదాపు 45 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడవద్దని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు.

ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా.. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఆదేశించారు. అలాగే రౌడీ షీటర్లలో ఎవరైనా తమ ప్రాంతం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. ముందుగా సంబంధిత సెక్టార్‌ ఎస్‌ఐకి సమాచారం అందించి అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించినా.. నేరాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *