Headlines

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం | High Court Advocate Nagoor Babu Fights to Protect the Survivor’s Privacy

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం | High Court Advocate Nagoor Babu Fights to Protect the Survivor’s Privacy


Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ ( ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు ఎన్ వాదించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనసాగుతుండటంతో ఆమె గోప్యత, గౌరవం, ప్రతిష్ఠకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఆయా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల గ్రీవెన్స్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21, సమాచార సాంకేతిక చట్టం–2000, ఐటీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్–2021, అలాగే లైంగిక నేర బాధితుల గుర్తింపును వెల్లడించకూడదని సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల అమలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్‌తో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేశారు.

అలాగే పిటిషన్‌కు జత చేసిన అనెక్సర్-ఏలో పేర్కొన్న 200కు పైగా యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్ పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ఎక్స్ పోస్టులు, ఇతర డిజిటల్ ప్రచురణలను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ప్రతివాద సంస్థలకు వ్యక్తిగత నోటీసులు అందజేసేందుకు పిటిషనర్ తరపు న్యాయవాదికి అనుమతి ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను 2026 ఆగస్టు 20కు వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి



న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ మధ్యంతర ఉత్తర్వులు లైంగిక నేర బాధితుల డిజిటల్ గోప్యత, గౌరవాన్ని కాపాడడంలో కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. అలాగే భారత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితుల గుర్తింపును బహిర్గతం చేసే కంటెంట్‌ను తొలగించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వేదికలపై ఉందని ఈ ఉత్తర్వులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *