IND vs SL: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15 నుంచి గాల్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీసులో వికెట్లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఉంటుందనేది బహిరంగ రహస్యమే అయినా, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన వేగంతో సరికొత్త ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరం కావడం భారత జట్టుకు పెద్ద దెబ్బే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పేస్ అనుకూల పిచ్‌లపైనే కాకుండా ఫ్లాట్ వికెట్లపై కూడా వికెట్లు తీయగల సామర్థ్యం బుమ్రా సొంతం. అతడు లేకపోవడంతో భారత బౌలింగ్ విభాగాన్ని నడిపించే పూర్తి బాధ్యత ఇప్పుడు సిరాజ్ భుజస్కంధాలపై పడింది.
బుమ్రా లేకపోతేనే సిరాజ్ చెలరేగుతాడా?
విచిత్రంగా అనిపించినా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జట్టు ప్రధాన పేసర్ బుమ్రా లేని సమయంలో సిరాజ్ మరింత బాధ్యతాయుతంగా రాణిస్తున్నాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో బుమ్రా ఆడలేదు. ఆ మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించి ఏకంగా 9 వికెట్లు పడగొట్టి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. అలాగే 2021 బ్రిస్బేన్ టెస్టును ఎవరూ మరచిపోలేరు. కేవలం రెండు టెస్టుల అనుభవంతోనే భారత చిరస్మరణీయ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇరు ఆటగాళ్లు కలిసి ఆడిన 29 టెస్టుల్లో సిరాజ్ 32 సగటుతో 90 వికెట్లు తీశాడు. అయితే బుమ్రా లేని 17 టెస్టుల్లో సిరాజ్ 25.4 అద్భుత సగటుతో 50 వికెట్లు తీయడం విశేషం. బుమ్రా లేకపోవడం జట్టుకు లోటే అయినప్పటికీ, అది సిరాజ్ లోని అసలైన టాలెంటును బయటకు తీసేందుకు ఒక గొప్ప అవకాశంగా మారుతోంది.
లంకపై రెడ్ బాల్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
టెస్టు ఫార్మాట్లో సిరాజ్ శ్రీలంకపై ఆడటం ఇదే తొలిసారి. 2022లో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడు భాగం కాలేదు. లంక గడ్డపై తొలిసారి టెస్టు ఆడుతున్న నేపథ్యంలో తన మార్కు చూపించాల్సిన ఒత్తిడి అతడిపై ఉంటుంది. అయితే శ్రీలంకపై బౌలింగ్ చేయడం సిరాజ్‌కు ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని వన్డే ఫార్మాట్లో ఇప్పటికే నిరూపించుకున్నాడు. లంకపై ఆడిన 9 వన్డేల్లో 14 అత్యుత్తమ సగటుతో ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అదే ఊపును రెడ్ బాల్ క్రికెట్లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మొత్తానికి బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిరాజ్, లంక బ్యాటర్లను వణికించడానికి సన్నద్ధమయ్యాడు. స్పిన్ పిచ్‌లపై కూడా తన రివర్స్ స్వింగ్, వేగంతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా సిరాజ్‌కు ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..