దేశంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతీఒక్కరూ ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. రేషన్ కార్డుల్లో పారదర్శకత, లబ్దిదారులను గుర్తించేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ ప్రాసెస్‌ను తప్పనిసరి చేసింది. రేషన్ కార్డుల్లో ఖచ్చితత్వంతో రేషన్ సరుకుల అక్రమాలను అడ్డుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. రేషన్ కార్డుల్లో పేరు ఉన్న ప్రతీ వ్యక్తి తమ ఆధార్ బయోమెట్రిక్స్ ద్వారా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియను చేపడతాయి. ఇది పూర్తి చేయకపోతే రేషన్ పొందటంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అయితే మొబైల్ ద్వారా కూడా కేవైసీ సింపుల్‌గా ఇంటి వద్దనే పూర్తి చేయవచ్చు.
మొబైల్ ద్వారా కేవైసీ పూర్తి చేయడం ఎలా..?
రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ షాపు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అయితే ఆ అవసరం లేనే లేదు. మీ చేతిలో ఉండే మొబైల్ ద్వారానే ఎక్కడినుంచైనా కంప్లీట్ చేయవచ్చు. చాలామంది ఉద్యోగ,విద్య, వ్యాపారం దృష్ట్యా వేరే ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు, దేశాల్లో నివసిస్తూ ఉంటారు. అలాంటివారు తమ సొంతూరు వెళ్లాల్సిన పని లేదు. మొబైల్ ద్వారానే కేవైసీ పూర్తి చేయవచ్చు. కేవలం మీ ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డీ, మేరా ఈకేవైసీ యాప్‌లు ఉంటే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు యాప్‌ల ద్వారా రేషన్ కేవైసీ ఫోన్ నుంచే సులభంగా పూర్తి చేయవచ్చు.
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..
-ముందుగా మీ ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డీ, మేరా ఈకేవైసీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోండి
-ముందుగా మేరా ఈకేవైసీ యాప్ ఓపెన్ చేయండి
-మీ స్టేట్ ఎంపిక చేసుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేయండి
-అనంతరం ఆధార్ నెంబర్ నమోదు చేయండి
-ఆ తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి
-ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి
-అనంతరం క్యాప్చా నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి
-మీ పేరు ,రాష్ట్రం, రేషన్ కార్డు నెంబర్, జిల్లా, ఆధార్ నెంబర్, కేవైసీ అయిందా లేదా అనేది కనిపిస్తుంది
-ఆ తర్వాత ఫేస్ ఈకేవైసీ బటన్‌పై క్లిక్ చేయండి
-అనంతరం కెమెరాలో మీ ఫేస్ చూపించండి
-ఆ తర్వాత కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లు స్క్రీన్‌పై మెస్సేజ్ కనిపిస్తుంది
ఆగస్ట్ 31 వరకు ఛాన్స్
తెలంగాణలో ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఆగస్ట్ 31 వరకు అవకాశం ఉంది. జులై 31తో గడువు ముగియగా.. మరింత పొడిగించారు. ఇక మీ కేవైసీ పూర్తి అయిందా లేదా అనే వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి చెందిన AePDS పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ పోర్టల్‌లో beneficiary Details ఆప్షన్ ఎంచుకుని రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం వెరిఫికేషన్ స్టే్టస్లో వ్యక్తి పేరు పక్కన నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తే కేవైసీ పూర్తి కానట్లు లెక్క