Headlines

Rishabh Pant: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్.. WTCలో రిషబ్ పంత్ సరికొత్త సంచలనం | Rishabh pant highest run scorer for india in wtc surpasses shubman gill rohit sharma


Rishabh Pant: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు వేగంగా పరుగులు కావాల్సిన సమయంలో రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకు అవుటైన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు.

గిల్, రోహిత్‌లను వెనక్కి నెట్టిన పంత్

డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ 2867 పరుగులతో అగ్రస్థానంలో ఉండేవాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన పరుగులతో పంత్ తన ఖాతాలో మొత్తం 2885 పరుగులు చేర్చుకుని గిల్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు. అంతకుముందే రోహిత్ శర్మ (2716 పరుగులు) రికార్డును పంత్ దాటేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రిషబ్ పంత్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

టాప్-10లో ఆసియా నుంచి ఒకే ఒక్కడు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆల్ టైమ్ అత్యధిక పరుగుల వీరుల జాబితాను పరిశీలిస్తే, టాప్-10లో ఒక్క భారతీయ బ్యాటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లదే ఇందులో పైచేయిగా ఉంది. ఆసియా ఖండం నుంచి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రమే 7వ స్థానంలో నిలిచి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ దిగ్గజం జో రూట్ 77 మ్యాచుల్లో 6651 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇది కూడా చదవండి: IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది?

రిషబ్ పంత్ అద్భుత గణాంకాలు

ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 41 మ్యాచులు ఆడిన పంత్, 73 ఇన్నింగ్స్‌లలో 41.81 సగటుతో 2885 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏకంగా 74.54 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించడం అతని భయమెరుగని బ్యాటింగ్‌కు నిదర్శనం. డబ్ల్యూటీసీ చరిత్రలో పంత్ ఇప్పటివరకు 314 ఫోర్లు, 80 సిక్సర్లు బాదాడు. ఈ టోర్నీ చరిత్రలోనే పంత్ కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 సిక్సర్లు) ఒక్కడే కావడం విశేషం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *