Headlines

Telangana: కాకి చేసిన పనికి బూడిదైన 18 లక్షలు.. ఏం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | Crow Causes Massive Fire in Karimnagar: Bakery Gutted, Loss Estimated at Rs 18 Lakh


షార్ట్ సర్క్యూట్స్, విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్ల ఎన్నో అగ్నిప్రమాదాలు చూస్తుంటాం. కానీ ఊహించని రీతిలో ఓ పక్షి చేసిన చిన్న పని భారీ విపత్తుకు దారితీసిన అరుదైన ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది. తీగలకు పక్షి తగిలిన తీవ్రతకు లైన్లు దెబ్బతిని, చివరకు ఓ దుకాణం సర్వనాశనమయ్యేలా చేసింది. కరీంనగర్ విద్యుత్ భవన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం పొద్దున్నే 11 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను ఒక కాకి తాకింది. దాంతో న్యూట్రల్ లైన్ తెగిపోయి, అక్కడే ఉన్న విశ్వ బేకరీ సర్వీస్ వైర్లలోకి హైవోల్టేజ్ కరెంట్ ఒక్కసారిగా సరఫరా అయ్యింది. నిమిషాల వ్యవధిలోనే బోర్డులు, వైరింగ్ పేలిపోయి దుకాణమంతటా నిప్పు రవ్వలు చిమ్మాయి.

హై ఓల్టేజ్ పవర్ రావడంతో బేకరీలోని వైర్లు కాలిపోయి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. లోపల ఉన్న తినుబండారాలు, ఫ్రిజ్‌లు, చెక్క సామాన్లకు మంటలు వేగంగా అంటుకున్నాయి. చుట్టుపక్కల వాళ్లు గమనించేలోపే దుకాణం మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలు ఆర్పేశారు. వాళ్లు సరైన సమయానికి రావడం వల్ల పక్కనే ఉన్న మిగతా షాపులకు మంటలు వ్యాపించలేదు. కాగా కరెంట్ షాక్ తగిలిన కాకి అక్కడే చనిపోయింది.

ఈ ప్రమాదం ఉదయం 8 గంటల సమయంలో జరగడంతో షాపులో జనం ఎవరూ లేరు. దీనివల్ల పెద్ద ప్రాణనష్టం తప్పింది. కానీ తన దుకాణంలో ఉన్న రూ.18 లక్షల విలువైన వస్తువులు, యంత్రాలు అన్నీ కాలిపోయాయని బేకరీ ఓనర్ లబోదిబోమంటున్నాడు. కష్టపడి నడుపుకుంటున్న వ్యాపారం కళ్లముందే బూడిదైపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *