Headlines

Telangana: తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్ర మంత్రికి పొంగులేటి వినతి | Allocate 11.56 Lakh Houses to Telangana: Minister Ponguleti Urges Union Minister Shivraj Singh Chouhan

Telangana: తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్ర మంత్రికి పొంగులేటి వినతి | Allocate 11.56 Lakh Houses to Telangana: Minister Ponguleti Urges Union Minister Shivraj Singh Chouhan


Telangana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పొంగులేటి కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన, రాష్ట్రంలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏడాది క్రితమే సర్వే పూర్తి.. మంజూరులోనే జాప్యం

రాష్ట్రవ్యాప్తంగా ఆవాస్ ప్లస్–2024 యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ సర్వేలో 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా తేలాయని తెలిపారు. వీటికి సంబంధించి సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలన్నీ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ, కేంద్రం నుంచి లక్ష్యాల ప్రకటనలో జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణలో గత 12 ఏళ్లుగా పేదలకు ఇళ్ల నిర్మాణం నిలిచిపోయి తీవ్రమైన డిమాండ్ పేరుకుపోయినందున, ఒకేసారి ఈ ఇళ్లన్నింటినీ మంజూరు చేయాలని కోరారు.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

PMAY-G కింద ఇచ్చే కేంద్ర వాటా, సాధారణ రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పొంగులేటి వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తెలంగాణలో పర్యటించాల్సిందిగా పొంగులేటి సాదరంగా ఆహ్వానించారు. స్వయంగా రాష్ట్రానికి వచ్చి PMAY-G 2.0 కింద ఇళ్ల కేటాయింపును ప్రకటిస్తే, తెలంగాణలోని గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలుస్తుందని, అది చారిత్రాత్మక ఘట్టంగా మారుతుందని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *