
తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దేశ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. స్వామి దర్శనం లభిస్తే చాలు.. జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేవారికి రూమ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వచ్చినవారు రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఎక్కడ పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు సలువుగా తిరుమలలో రూమ్స్ పొందవచ్చు. ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం.
తిరుమలలో రూమ్స్ పొందటం ఈజీ
తిరుమలలో ఆఫ్‌లైన్‌లో రూమ్ కావాలంటే ముందుగా సీఆర్వో ఆఫీస్ దగ్గరకు వెళ్లాలి. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ రూమ్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. గదులు అందుబాటులో ఉన్నంతవరకు జారీ చేస్తూనే ఉంటారు. రూమ్స్ అన్నీ బుక్ అయ్యాక రిజిస్ట్రేషన్లు క్లోజ్ చేస్తారు. మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకెళ్లి సీఆర్వో ఆఫీస్ వద్ద రూమ్స్ ఇచ్చే క్యూలైన్లలో నిల్చోవాలి. ఓరిజినల్ ఆధార్ లేదా ఆధార్ జిరాక్స్ కాపీ చూపించి మీ మొబైల్ నెంబర్ తెలపాలి. దీంతో మీ పేరుపై రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేస్తారు. మీ ఫేస్‌ను ఫొటో కూడా తీసుకుంటారు. మీకు రూ.50, రూ.100, రూ.వెయ్యిలలో ఏ రూమ్ కావాలనేది అడిగి రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గంట తర్వాత మీకు రూమ్ కేటాయింపు జరుగుతుంది. రూమ్ ఎక్కడ కేటాయించారనే వివరాలు మీ ఫోన్‌కు మెస్సేజ్ రూపంలో అందుతాయి.
రూమ్ ఎలా తీసుకోవాలి..?
రూమ్ అలాట్మెంట్ చేసినట్లు మీ ఫోన్‌కు మెస్సేజ్ రాగానే గంటలోగా మీరు రూమ్ తీసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. మీకు వచ్చిన మెస్సేజ్‌లో రూమ్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్‌కు చేరుకుని అక్కడ ఉండే ఉప విచారణ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ రూమ్ రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. క్యాష్ రూపంలో రూమ్ అద్దె చెల్లించడం కుదరదు. గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు విధానాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అద్దె చెల్లించిన తర్వాత మరోచోట రూమ్ తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది. తాళాలు తీసుకుని మీ రూమ్‌కి వెళ్లవచ్చు. రూమ్ తీసుకోవాలంటే కనీసం 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఒక్కసారి గది పొందిన తర్వాత అదే ఆధార్ కార్డుపై నెల రోజుల పాటు మళ్లీ పొందే అవకాశం ఉండదు. రూమ్ కోసం ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే క్యూలైన్లోకి వెళ్లాలి.