దొంగతనం అనగానే సాధారణంగా చీకట్లో ముసుగు వేసుకుని, పట్టుబడిపోతామనే భయంతో చప్పుడు కాకుండా క్షణాల్లో సొత్తు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ దొంగతనం చూస్తే మాత్రం పోలీసులతో సహా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒక దొంగ ఆటోమోబైల్ షోరూమ్‌లో ఏకంగా సాడేనాలుగు గంటల పాటు తిష్టవేశాడు. హాయిగా కాఫీ తాగాడు, వాష్‌రూమ్‌లో స్నానం చేశాడు, పాటలు పెట్టుకుని మరీ లుంగీ డ్యాన్స్ చేశాడు. చివరికి షోరూమ్ మేనేజర్‌కు చెందిన రూ.4.71 లక్షల విలువైన లగ్జరీ కేటీఎం బైక్‌ను తీసుకుని ఉడాయించాడు.
4 గంటల వినోదం: సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
వారణాసిలోని మండువాడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి 10 గంటలకు సిబ్బంది షోరూమ్‌ను మూసివేసి వెళ్లిన తర్వాత రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘనుడు ప్రవేశించాడు. గ్లాస్ డోర్‌ను కట్టర్‌తో కట్ చేయడానికి దాదాపు 36 నిమిషాల సమయం తీసుకుని, అర్ధరాత్రి 12:06 గంటలకు లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి రాగానే నేరుగా రిసెప్షన్ వద్ద ఉన్న కంప్యూటర్ దగ్గరకు వెళ్లి, రివాల్వింగ్ ఛైర్‌లో తిరుగుతూ కాసేపు ఎంజాయ్ చేశాడు. తర్వాత ఫ్రిజ్ లోని చల్లటి నీరు తాగి, వెండింగ్ మెషిన్ నుంచి వేడి వేడి కాఫీ కప్పుతో రిలాక్స్ అయ్యాడు. అంతటితో ఆగక వాష్‌రూమ్‌లోకి వెళ్లి హాయిగా స్నానం చేశాడు. తడిసిన తన బట్టలను ఒక బైక్‌పై ఆరేశాడు. అక్కడ ఉన్న ఒక కొత్త బైక్ కవర్‌ను చించి దాన్ని లుంగీలా కట్టుకుని, కంప్యూటర్‌లో పాటలు ప్లే చేస్తూ లుంగీ డ్యాన్స్ చేశాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వెళ్లేముందు షోరూమ్ బ్రాండెడ్ టీ షర్ట్, క్యాప్ ధరించి.. షోరూమ్ మేనేజర్‌కు చెందిన రూ.4.71 లక్షల విలువైన KTM బైక్‌పై నిపీడంగా పారిపోయాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు
మరుసటి రోజు ఉదయం సెక్యూరిటీ గార్డ్ గాజు తలుపులు పగిలి ఉండటాన్ని గమనించి మేనేజర్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాలను చూసిన యాజమాన్యం, పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విచిత్ర చోరీపై స్పందించిన వారణాసి డీసీపీ, మండువాడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రల ఆధారంగా నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని వెల్లడించారు.
వీడియో చూడండి..
Varanasi: A thief spent 4 hours inside a bike agency, made coffee, took a bath, danced to music, and even dried his clothes before fleeing with the manager’s ₹4.70 lakh KTM bike😭💀 pic.twitter.com/6C5cdMOhnM
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 13, 2026