Headlines

ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..! | TAFRC Cracks Down on Private Engineering Colleges Over Excess Fees, Warns of Heavy Penalties

ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..! | TAFRC Cracks Down on Private Engineering Colleges Over Excess Fees, Warns of Heavy Penalties


హైదరాబాద్‌, జులై 28: తెలంగాణలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ వసూళ్లపై తెలంగాణ ప్రవేశాలు, రుసుముల క్రమబద్ధీకరణ కమిటీ (TAFRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు కాకుండా విద్యార్థుల నుంచి ఇతర పేర్లతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టీఏఎఫ్‌ఆర్‌సీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ జీవో ద్వారా ఆమోదించిన రుసుములు తప్ప, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఇతర రుసుములు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

అడ్మిషన్, స్పెషల్ ఫీజుల పేరుతో దోపిడీ చేస్తే చట్టపరమైన చర్యలు

చాలా విద్యాసంస్థలు అడ్మిషన్ ఫీజు, ఎన్‌బిఏ ఫీజు, స్పెషల్ ఫీజు, కెరీర్ డెవలప్‌మెంట్ ఫీజు, యూనిఫాం ఫీజు అంటూ రకరకాల పేర్లతో విద్యార్థుల నుంచి అదనపు నిధులు గుంజుతున్నట్లు వార్తాపత్రికలలో కథనాలు రావడంపై టీఏఎఫ్‌ఆర్‌సీ స్పందించింది. ఈ తరహా వసూళ్లన్నీ పూర్తిగా అనధికారికం, అక్రమం మరియు చట్టవిరుద్ధమని కమిటీ తేల్చిచెప్పింది. నిర్దేశించిన రుసుము కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా దానిని క్యాపిటేషన్ ఫీజుగా భావించి, సంబంధిత కాలేజీ యాజమాన్యాలపై చట్టరీత్యా కఠినమైన శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు – విద్యాశాఖకు సమాచారం

రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు నిర్మాణాన్ని మాత్రమే కచ్చితంగా పాటించాలని, ఏ పేరుతోనూ విద్యార్థుల నుంచి అదనపు డబ్బులు తీసుకోకూడదని టీఏఎఫ్‌ఆర్‌సీ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై విద్యార్థికి లెక్కన భారీ ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఈ నోటీసు ప్రతులను ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, టీఎస్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్, సాంకేతిక విద్యా కమిషనర్ తో పాటు జేఎన్టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్లకు కూడా తదుపరి చర్యల నిమిత్తం సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *