Headlines

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరిట వేధింపులు.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే? | Instagram Friendship Turns Criminal Case: Trainee IPS Uday Krishna Reddy Booked for Stalking, Cyber Harassment

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరిట వేధింపులు.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే? | Instagram Friendship Turns Criminal Case: Trainee IPS Uday Krishna Reddy Booked for Stalking, Cyber Harassment


హైదరాబాద్, జూలై 29: లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపులు తదితర ఆరోపణల కేసులో ఐపీఎస్ ట్రైనీ అధికారి ఎం ఉదయ్ కృష్ణారెడ్డి (33)ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి, అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ ఐపీఎస్ ట్రైనీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శివరాంపల్లిలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVP NPA)లో శిక్షణ పొందుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారి.. ఆపై..

2025 మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలితో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఐపీఎస్ ఎంపికకు సంబంధించిన అంశాలపై మాట్లాడుకుంటూ సన్నిహితులై, అనంతరం ప్రేమ సంబంధంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య తరచూ విభేదాలు తలెత్తేవి. ఈ క్రమంలో నిందితుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం, ఆయుధాలు ప్రదర్శించడం, దూషించడం, ఒకేసారి పలువురితో సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి చేయడం, బాధితురాలి ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేయడం, బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, వ్యక్తిగత చాట్‌లను బయటపెడతానని బెదిరించడం, ఆమె కుటుంబ సభ్యులు, సహచరులను అనుమతి లేకుండా సంప్రదించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఈ కారణాల వల్ల సంబంధాన్ని ముగించుకుని, అనంతరం మరొకరిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ నిందితుడు వేధింపులు కొనసాగించారు.

ఈ కేసులో విచారణ అనంతరం నిందితుడి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు జూలై 28 రాత్రి సుమారు 9:30 గంటలకు హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ఎక్స్ రోడ్స్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *