Headlines

ఒక్క చీర.. రెండు ఘోరాలు.. సినిమాను మించిన 30 ఏళ్ల క్రైమ్ కథ.. చివరకు.. | 30 Year Mystery Solved: How a Dispute Over a Saree Led to Double Murders

ఒక్క చీర.. రెండు ఘోరాలు.. సినిమాను మించిన 30 ఏళ్ల క్రైమ్ కథ.. చివరకు.. | 30 Year Mystery Solved: How a Dispute Over a Saree Led to Double Murders


ఏదైనా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తుంటే.. ఆఖరి వరకు అసలు నేరస్థుడు ఎవరనేది అంచనా వేయడం కష్టం. ప్రతీ క్షణం ఒక కొత్త అనుమానితుడు తెరపైకి వస్తుంటాడు.. చివర్లో అసలు నిజం బయటపడి షాక్ ఇస్తుంది. సరిగ్గా ఇలాంటి సినిమాటిక్ క్రైమ్ డ్రామా ఒకటి నిజ జీవితంలో జరిగింది. కేవలం ఒక చీర గొడవతో మొదలై, రెండు రాష్ట్రాల పోలీసులకు 30 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన ఇద్దరు అన్నదమ్ముల దారుణాలు ఎట్టకేలకు వెలుగులోకి వచ్చాయి. ఈ కథ 1996 సెప్టెంబర్ 27న పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్ పాత బట్టల మార్కెట్‌లో మొదలైంది. ఒక చీర కొనుగోలు విషయంలో వ్యాపారి ఇష్తియాక్ అహ్మద్‌తో షానవాజ్ అనే వ్యక్తి గొడవపడ్డాడు. ఆ తర్వాత షానవాజ్ తన సోదరుడు ఫిరాసత్ అలీ, మరికొందరితో కలిసి ఇష్తియాక్ గదిపై దాడి చేసి దారుణంగా పొడిచి చంపేశారు. ఈ కేసులో ఢిల్లీ కోర్టు వీరిద్దరికీ జీవిత ఖైదు విధించింది. అయితే 2000 సంవత్సరంలో బెయిల్ పొందిన ఈ ఇద్దరు సోదరులు.. అక్కడి నుంచి పరారై ముసుగు వీరులుగా మారిపోయారు.

ముంబై 2006: భెండి బజార్‌లో సంచలనం

మరోవైపు 2006 మే 14న ముంబైలోని భెండి బజార్ మటన్ మార్కెట్‌లో ఒక వ్యాపారికి ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. అందులో తల, చేతులు, కాళ్లు లేని ఒక వ్యక్తి మొండెం మాత్రమే ఉంది. డీఎన్ఏ పరీక్షలు చేసినా, మిస్సింగ్ కేసులు వెతికినా మృతుడెవరో ఏళ్ల తరబడి తేలలేదు. దాదాపు పదేళ్ల తర్వాత వచ్చిన ఒక చిన్న ఆధారంతో ఆ మృతదేహం కిషన్ ఖార్వాది అని తేలింది. కిషన్ భార్య బన్సీబెన్‌ను విచారించగా అసలు నిజం బయటపడింది. రోజూ తాగి వచ్చి వేధించే భర్తను వదిలించుకోవడానికి ఆమె రూ.2 లక్షల సుపారీ ఇచ్చిందని, ఆ సుపారీ తీసుకుని కిషన్‌ను చంపి ముక్కలుగా నరికి పారేసింది మరెవరో కాదు.. పరారీలో ఉన్న అదే ఫిరాసత్ అలీ అని తేలింది.

సామాన్యుల అవతారంలో వ్యాపారం

2021లో ముంబై హైకోర్టు నుంచి కూడా బెయిల్ పొందిన ఫిరాసత్ మళ్లీ పరారయ్యాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ పౌరులుగా చెలామణి అయ్యేవారు. పాత బట్టల వ్యాపారం చేస్తూ… ఫిరాసత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరుకు పంపేవాడు. షానవాజ్ జార్ఖండ్, మహారాష్ట్రల వ్యాపారం చూసుకునేవాడు. ఢిల్లీ పోలీసుల యాంటీ రాబరీ అండ్ స్నాచింగ్ సెల్‌కు వచ్చిన ఒక రహస్య సమాచారంతో కథ అడ్డం తిరిగింది. నిందితులు ఒకరికొకరు అలర్ట్ కాకుండా పోలీసులు ఒకే సమయంలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో మెరుపు దాడులు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఒక చిన్న చీర గొడవతో మొదలై, దశాబ్దాల పాటు ముంబై, ఢిల్లీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ కరుడుగట్టిన నేరస్థులు ఎట్టకేలకు తిహార్ జైలు గోడల మధ్యకు చేరడంతో ఈ 30 ఏళ్ల సస్పెన్స్ క్రైమ్ డ్రామాకు తెరపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *