Headlines

ఓట్లు గ్రామాలవి.. అభివృద్ధి నగరాలదా? ఇదెక్కడి న్యాయం? | Rural Votes, Urban Growth? Why Development Remains Uneven in Andhra Pradesh and Telangana

ఓట్లు గ్రామాలవి.. అభివృద్ధి నగరాలదా? ఇదెక్కడి న్యాయం? | Rural Votes, Urban Growth? Why Development Remains Uneven in Andhra Pradesh and Telangana


ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని గెలిపించేది గ్రామం. ఆర్థిక వ్యవస్థను నడిపేది నగరం. కానీ నిజమైన అభివృద్ధి అంటే ఈ రెండింటి మధ్య దూరాన్ని తగ్గించడమే. ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అడుగులు ముందుగా పడేది గ్రామాల్లోనే. రైతు ఇంటి ముంగిట కూర్చుంటారు. బీడు భూముల్లో నడుస్తారు. చెరువుల గట్టుపై సభలు పెడతారు. “రైతే రాజు… గ్రామమే రాష్ట్రానికి వెన్నెముక” అని హామీలు ఇస్తారు. గ్రామీణ ఓటరే ప్రభుత్వాలను నిర్ణయిస్తాడని ప్రతి నాయకుడు చెబుతాడు.

కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి దారి ఎటు తిరుగుతోంది? కోట్ల రూపాయల పెట్టుబడులు, ఐటీ కంపెనీలు, మెట్రో రైళ్లు, ఫ్లైఓవర్లు, విమానాశ్రయాలు, కార్పొరేట్ ఆస్పత్రులు, భారీ విద్యాసంస్థలు… ఇవన్నీ ఎక్కువగా నగరాలకే పరిమితమవుతున్నాయా? గ్రామాలు మాత్రం సంక్షేమ పథకాలకే పరిమితమవుతున్నాయా? ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు వస్తున్న కీలక ప్రశ్న.

గ్రామీణ జనమే ఎక్కువ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ గ్రామీణ జనాభానే అధికం. తెలంగాణలో సుమారు 61 శాతం మంది గ్రామాల్లో నివసిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంఖ్య దాదాపు 70 శాతానికి చేరుకుంటుంది. అంటే ప్రతి ఎన్నికలో ప్రభుత్వాన్ని నిర్ణయించే ఓట్లలో అధిక భాగం గ్రామాల నుంచే వస్తుంది. ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఒక ఎంపీ గెలవాలన్నా, చివరకు ప్రభుత్వం ఏర్పడాలన్నా గ్రామీణ ఓటరే కీలకం.

అయితే ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తే మరో చిత్రం కనిపిస్తుంది. తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వాటా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తోంది. ఐటీ ఎగుమతులు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ పెట్టుబడులు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, కార్పొరేట్ ఆస్పత్రులు, బహుళజాతి సంస్థలు అన్నీ ప్రధానంగా హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్, కొమురంభీం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నాయని పలువురు అభివృద్ధి పరిశీలకులు చెబుతున్నారు.

పెట్టుబడులు ఎక్కడ..

ఆంధ్రప్రదేశ్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నం, అమరావతి ప్రాంతం, భోగాపురం, కాకినాడ, తిరుపతి, కృష్ణపట్నం వంటి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, పోర్టులు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, పారిశ్రామిక కారిడార్లు రూపుదిద్దుకుంటున్నాయి. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాలు, రాయలసీమలోని అనేక గ్రామీణ మండలాలు, ఉత్తరాంధ్రలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఆదాయం ఎక్కడ…

ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. గ్రామాలు ప్రభుత్వాలకు ఓట్లు ఇస్తున్నాయి. నగరాలు ప్రభుత్వాలకు ఆదాయం తెస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు ఒకవైపు గ్రామాల్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు నగరాల్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వలసలు..

ఉద్యోగాల పరిస్థితి కూడా ఇదే కథ చెబుతోంది. తెలంగాణలో ఐటీ రంగ ఉద్యోగాల్లో అత్యధిక భాగం హైదరాబాద్‌లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్ద పరిశ్రమలు, ఐటీ, పోర్టు ఆధారిత ఉపాధి అవకాశాలు ప్రధాన నగరాల చుట్టూ ఉన్నాయి. ఫలితంగా గ్రామాల యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్తోంది. మరోవైపు వ్యవసాయ పనుల కోసం బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వలస కూలీలు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. అంటే గ్రామాల నుంచి యువత నగరాలకు వెళ్తుంటే, గ్రామాల్లో వ్యవసాయం కొనసాగించేందుకు బయటి రాష్ట్రాల కార్మికులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది.

పల్లెసీమలో ఉండేదెవరు

ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, సామాజిక మార్పు కూడా. గ్రామాల్లో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో వృద్ధులు, వ్యవసాయం మాత్రమే మిగులుతోంది. ప్రభుత్వాలు గ్రామాలకు సంక్షేమం అందిస్తున్నప్పటికీ, స్థిరమైన ఉపాధి అవకాశాలు మాత్రం నగరాల చుట్టూనే ఉంటున్నాయని విమర్శకులు అంటున్నారు.

అయితే ప్రభుత్వాల వాదన భిన్నంగా ఉంది. పెద్ద నగరాల్లో పెట్టుబడులు పెరిగితే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. చివరికి దాని ప్రయోజనం గ్రామాలకూ చేరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గ్రామీణాభివృద్ధి నిపుణులు మాత్రం గ్రామాల్లోనే విలువ ఆధారిత వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, స్థానిక ఉపాధి అవకాశాలు పెరగకపోతే వలసలు తగ్గవని అంటున్నారు.

ప్రభుత్వాలను గెలిపించే గ్రామాలకు అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం దక్కుతోందా? లేక ఆర్థికాభివృద్ధి పేరుతో నగరాలకే ప్రాధాన్యం పెరుగుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయ ఆరోపణల్లో కాదు… గణాంకాల్లో, బడ్జెట్ కేటాయింపుల్లో, పెట్టుబడుల పంపిణీలో, ఉద్యోగాల సృష్టిలో, గ్రామాల నుంచి జరుగుతున్న వలసల్లో దాగి ఉంది.

చివరిగా.. ప్రతి ఎన్నికలో ఓటు గ్రామం వేస్తుంది. ప్రతి బడ్జెట్‌లో పెట్టుబడి నగరం తీసుకుంటుంది. ఈ రెండింటి మధ్య దూరం తగ్గిన రోజే అభివృద్ధి నిజంగా సమానమైందని చెప్పవచ్చు.

కొండవీటి శివనాగరాజు

టీవీ9 డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *