Headlines

కాకరకాయ ఎందుకు చేదుగా ఉంటుంది..? దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే.. | Why Bitter Gourd is Bitter, Science Behind it, Does Karela Juice Really Cure Diabetes?


కాకరకాయ పేరు వినగానే చాలామందికి దాని చేదు రుచే గుర్తొస్తుంది. అయితే ఈ చేదు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? పచ్చి కాకరకాయ రసం తాగితే నిజంగానే షుగర్ నయమవుతుందా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. కాకరకాయలోని తీవ్రమైన చేదు రుచికి అందులో ఉండే మొమార్డిసిన్, కుకుర్బిటాసిన్ వంటి కుకుర్బిటేన్ రకం ట్రైటెర్పెనాయిడ్ సమ్మేళనాలే కారణం. ఇది ప్రకృతి సిద్ధంగా ఆ మొక్కకు లభించిన సహజ రక్షణ వ్యవస్థ. శాకాహార జంతువులు, హానికర కీటకాల బారిన పడకుండా మొక్క తనను తాను కాపాడుకోవడానికి ఈ చేదు రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

కీటకాలపై కుకుర్బిటాసిన్ ప్రభావం

పెస్ట్ మేనేజ్‌మెంట్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం.. కుకుర్బిటాసిన్ బి సమ్మేళనం కీటకాల శరీరంలోని 20 హైడ్రాక్సీఎక్డైసోన్ అనే కీలక స్టెరాయిడ్ హార్మోన్ పనితీరును అడ్డుకుంటుంది. దీనివల్ల కీటకాల లార్వాల పెరుగుదల, రూపాంతరీకరణ దెబ్బతిని అవి నశిస్తాయి. అంటే, ఇది ఒక సహజసిద్ధమైన పురుగుల నివారిణిగా మొక్కకు ఉపయోగపడుతుంది.

పచ్చి కాకరకాయ రసంతో డయాబెటిస్ తగ్గుతుందా?

రోజూ ఉదయాన్నే పచ్చి కాకరకాయ రసం తాగితే మధుమేహం పూర్తిగా నయమవుతుందని చాలామంది బలంగా నమ్ముతారు. అయితే, దీనికి ఎలాంటి శాస్త్రీయ లేదా వైద్యపరమైన ఆధారాలు లేవు. 414 మంది రోగులపై జరిగిన 9 వేర్వేరు క్లినికల్ ట్రయల్స్‌ను క్రోడీకరిస్తూ 2024లో వెలువడిన ఒక సమగ్ర మెటా విశ్లేషణ ప్రకారం.. కాకరకాయ వల్ల ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లేదా HbA1c స్థాయిల్లో ఆశించిన మార్పులేవీ కనిపించలేదు. కాకరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిదే అయినా, వైద్యుల మందులకు ప్రత్యామ్నాయంగా కేవలం కాకర రసంపై ఆధారపడటం ఏమాత్రం మంచిది కాదు.

అసాధారణ చేదు ప్రాణాంతకం

సాధారణంగా దొరికే దోసకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి లేదా జుకినీ వంటి కూరగాయలు వాతావరణ ఒత్తిడికి గురైనప్పుడు వాటిలో కుకుర్బిటాసిన్ మోతాదు విపరీతంగా పెరిగిపోతుంది. పాయిజన్ కంట్రోల్ సంస్థ హెచ్చరికల ప్రకారం, కుకుర్బిట్ జాతి కూరగాయలు అసాధారణంగా చేదుగా ఉంటే వాటిని అస్సలు తినకూడదు. అధిక మోతాదులో కుకుర్బిటాసిన్ శరీరంలోకి చేరితే టాక్సిక్ స్క్వాష్ సిండ్రోమ్ వస్తుంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్, రక్తపోటు పడిపోవడం వంటి విషప్రభావాలు ఎదురవుతాయి. ఈ విషపూరిత సమ్మేళనం కూరగాయను ఉడకబెట్టినా, వేయించినా లేదా ఎంతగా వండినా నశించదు.

సాధారణ కాకరకాయలో ఉండే చేదు సహజమైనది కాబట్టి దానిని కూరగా మితంగా నిరభ్యంతరంగా తినొచ్చు. కానీ కాకర రసంతో డయాబెటిస్ పోతుందన్న ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అదే సమయంలో దోస, సొర వంటి ఇతర కూరగాయలు అసాధారణ చేదుగా అనిపిస్తే వెంటనే పారేయడమే ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *