Headlines

Tollywood : 395కు పైగా సినిమాలు.. విలనిజంకు కొత్త అర్థం చెప్పిన గొప్ప నటుడు.. అప్పట్లోనే బిజీ ఆర్టిస్ట్.. చివరకు.. | The Legendary Telugu Villain Who Revolutionised On Screen Antagonism, He Is Rakta Kanneeru Star Nagabhushanam


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతినాయక పాత్రలకు కొత్త కోణాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిన అరుదైన నటుడు చుండి నాగభూషణం. విలన్‌గా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయంటే ఆయన నటనలోని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. విలనీకి హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి తనదైన ముద్ర వేసుకున్న నాగభూషణం జీవితం, ఒక కళాకారుడి అవిశ్రాంత కృషికి నిదర్శనం. 1921 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లాలోని అనకర్లపూడి గ్రామంలో రాఘవరావు, సీతమ్మ దంపతులకు నాగభూషణం జన్మించారు. వారిది ఆర్థికంగా బలహీనమైన కుటుంబం. బాల్యం నుండే కష్టాలు ఎదుర్కొన్నారు. చిన్న చిన్న పనులు చేస్తూ ఇంటర్ పూర్తి చేసి, పై చదువులకు స్వస్తి పలికారు. 1942లో తండ్రి మరణించిన రోజే రైల్వే శాఖ నుంచి మద్రాసులో ఉద్యోగ ఇంటర్వ్యూకు ఆహ్వానం వచ్చింది. రైల్వేలో సహోద్యోగులు వేసే నాటకాలను చూసి నటనపై ఆసక్తి పెంచుకున్నారు. నాటకరంగంలో కృషి చేయాలనే లక్ష్యంతో విజయవాడకు బదిలీ చేయించుకున్నారు. విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంతో పరిచయం, అప్పట్లో వామపక్ష భావజాల ప్రచార కేంద్రంగా ఉన్న ఆ గ్రంథాలయం ద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, నాటకరంగ ప్రముఖులతో నాగభూషణానికి అనుబంధం ఏర్పడింది. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, జి.వరలక్ష్మి వంటివారితో కలిసి ఆత్రేయ రాసిన “భయం”, “కప్పలు” నాటకాల్లో నటించారు. రచయిత పాలగుమ్మి పద్మరాజును గురువుగా భావించి, ఆయనకు సన్నిహితుడిగా మెలిగారు.

1951లో “పల్లెటూరు” చిత్రంతో నాగభూషణం సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో విలన్‌గా, తాగుబోతుగా, ఇతర సహాయ పాత్రల్లో నటించారు. 1956లో ఆయన బాల్య స్నేహితుడు ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన “ఏది నిజం” చిత్రంలో హీరోగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై రాష్ట్రపతి బహుమతిని పొందినా, నాగభూషణానికి హీరోగా ఆశించిన గుర్తింపు రాలేదు. దీంతో “మాయాబజార్” వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేస్తూ, నాటకాలపై దృష్టి సారించారు. నాగభూషణం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది “రక్తకన్నీరు” నాటకం. తమిళంలో ఎం.ఆర్.రాధా “రక్తకన్నీర్” నాటకానికి ప్రేరణ పొంది, తన గురువు పాలగుమ్మి పద్మరాజుతో మార్పులు చేయించి, తెలుగులో రాయించారు. “రవి ఆర్ట్ థియేటర్స్” సంస్థను స్థాపించి 1956 మేలో తొలి ప్రదర్శన ఇచ్చారు. మొత్తం 5432 ప్రదర్శనలు ఇచ్చి అద్భుత విజయం సాధించారు. వాణిశ్రీ, శారద, రేవతి వంటి ఎందరో నటీమణులు ఈ నాటకం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ప్రతినెల మొదటి వారం నాటకాలకు కేటాయించి, వచ్చిన ఆదాయాన్ని సభ్యులందరికీ పంచేవారు.

నాగభూషణం కొన్ని చిత్రాలను నిర్మించారు, హీరోగా కూడా నటించారు. “నాటకాల రాయుడు”, “మహమ్మద్ బిన్ తుగ్లక్” చిత్రాల్లో హీరోగా చేశారు. ఆయన నిర్మించిన “ప్రజానాయకుడు”, “భాగస్తులు” చిత్రాలు పెద్దగా ఆడలేదు. 1974లో “ముత్యాలముగ్గు” చిత్రంతో రావు గోపాలరావు అనే కొత్త విలన్ పరిచయం కావడంతో, నాగభూషణంకు పోటీ పెరిగింది. అప్పటికే ఆయన నటన మోనాటనీకి చేరిందని బయ్యర్లు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితంలో నాగభూషణం మూడు వివాహాలు చేసుకున్నారు. 1941లో సుబ్బరత్నంను వివాహమాడారు. ఆమె అకాల మరణం తర్వాత శశిరేఖను, ఆ తర్వాత 1956లో తన సహనటి సీతను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. కుమార్తె భువనేశ్వరిని ఛాయాగ్రాహకుడు మీర్‌కు ఇచ్చి మతాంతర వివాహం చేశారు. 1994లో విడుదలైన “నెంబర్ వన్” నాగభూషణం చివరి చిత్రం. 1995 మే 5న ఆయన తుదిశ్వాస విడిచారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *