Headlines

కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. కళ్లు ఉండవ్ కానీ, దీనిది చిన్న కథ కాదు! | Scientists Discover Rare ‘Demon Cavefish’ With No Eyes and Transparent Skin, Brain Visible Through Body

కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. కళ్లు ఉండవ్ కానీ, దీనిది చిన్న కథ కాదు! | Scientists Discover Rare ‘Demon Cavefish’ With No Eyes and Transparent Skin, Brain Visible Through Body


అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు శాస్త్ర ప్రపంచానికి తెలియని అత్యంత అరుదైన గుహ చేప జాతిని గుర్తించారు. హంట్స్‌విల్లే సమీపంలోని బాబ్‌క్యాట్ గుహలో ఈ చేపను కనుగొన్నారు. కళ్లులేకపోవడం, పూర్తిగా పారదర్శకమైన శరీరం, గూని ఆకారపు వెన్నెముక, ముళ్లలాంటి ఈకలు వంటి ప్రత్యేక లక్షణాలతో ఈ చేప అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మెదడు కూడా బయటే కనిపిస్తుంది

ఈ కొత్త చేపలో ఎలాంటి వర్ణద్రవ్యం (Pigment) ఉండదు. దీంతో దాని చర్మం పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. అంతేకాదు, చర్మం లోపల ఉన్న మెదడు కూడా స్పష్టంగా కనిపించడం దీని అత్యంత విశేషం. ఇలాంటి పారదర్శక శరీరం సాధారణంగా కొన్ని చిన్న చేపల్లో కనిపించినా, గుహ చేపల్లో ఇంత స్పష్టంగా ఉండటం చాలా అరుదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇది కూడా చదివేయండి: అత్యంత తెలివైన జీవి.. 9 మెదళ్లు, 3 గుండెలతో పుట్టింది! చాలా మందికి తెలియని అద్భుతం

రాక్షసుడి పేరు పెట్టారు

ఈ చేపకు Demogorgonychthys arcanus (డెమోగోర్గోనిచ్థిస్ ఆర్కానస్) అనే శాస్త్రీయ నామం పెట్టారు. సాధారణంగా దీనిని డీమన్ కేవ్‌ఫిష్ (Demon Cavefish) అని పిలుస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్రసిద్ధ సిరీస్ స్ట్రేంచ్ థింగ్స్‌లోని డెమోగార్గన్ అనే రాక్షసుడి నుంచి స్ఫూర్తి పొంది ఈ పేరు పెట్టినట్లు పరిశోధకులు వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేపల్లో ఒకటి

ఈ చేప ఇప్పటివరకు ఒక్క బాబ్‌క్యాట్ గుహలో మాత్రమే గుర్తించబడింది. మొత్తం జనాభా ఎంత ఉందో కూడా తెలియదు. ఇటీవల గుహలో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కేవలం 27 చేపలను మాత్రమే గుర్తించారు. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేప జాతుల్లో ఒకటిగా భావిస్తున్నారు.

ఇది కూడా చదివేయండి: అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..

CT స్కాన్‌లు, DNA పరీక్షలతో నిర్ధారణ

ఈ చేప కొత్త జాతేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పరిశోధకులు CT స్కాన్‌లు, DNA పరీక్షలు, అస్థిపంజర విశ్లేషణలు నిర్వహించారు. ఫలితాల్లో ఇది ఇప్పటికే తెలిసిన దక్షిణ గుహ చేపల జాతికి పూర్తిగా భిన్నమని తేలింది. దీంతో దీనిని కొత్త జాతిగా అధికారికంగా గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

జీవవైవిధ్యానికి మరో కీలక ఆవిష్కరణ

డెమన్ కేవ్‌ఫిష్ ఆవిష్కరణతో ఇప్పటికే విస్తృతంగా అధ్యయనం చేసిన ప్రాంతాల్లో కూడా కొత్త జీవజాతులు దాగి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుహ జీవులు భూగర్భ జలాల నాణ్యతకు సూచికలుగా పనిచేస్తాయని, వాటి పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కొత్త చేప ఆవిష్కరణ భూమిపై ఇంకా ఎన్నో తెలియని జీవులు ఉన్నాయనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *