Headlines

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. లబ్ధిదారులకు పంపిణీ ఎప్పుడంటే? | Telangana Smart Ration Cards Ready: QR Code Enabled PVC Cards to Replace Old Paper Ration Cards Soon

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. లబ్ధిదారులకు పంపిణీ ఎప్పుడంటే? | Telangana Smart Ration Cards Ready: QR Code Enabled PVC Cards to Replace Old Paper Ration Cards Soon


ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పదేళ్లుగా ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో భద్రతా ప్రమాణాలు, డిజిటల్ సదుపాయాలతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డులు కాలక్రమేణా చిరిగిపోవడం, తడిసి పాడవడం, వివరాలు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. దీంతో లబ్ధిదారులు నెట్ సెంటర్లలో ఆన్‌లైన్ ప్రింట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొస్తోంది. కొత్త పీవీసీ కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటోతో పాటు ప్రత్యేక రేషన్ కార్డు నంబర్ ముద్రించనున్నారు. వెనుక భాగంలో అధునాతన క్యూఆర్ కోడ్ ఉండనుంది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, వారి వయస్సు, ఆధార్ అనుసంధాన సమాచారం వెంటనే అందుబాటులోకి వచ్చేలా వ్యవస్థను రూపొందించారు.

ఈ స్మార్ట్ కార్డుల ద్వారా వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్ పథకం కింద లబ్ధిదారులు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా తమకు కేటాయించిన రేషన్ సరుకులను పొందే అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్‌తో పాటు వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించి సరుకులు పంపిణీ చేయనున్నారు. దీంతో నకిలీ కార్డులు, దళారుల జోక్యం, అక్రమాలపై మరింత సమర్థంగా నియంత్రణ సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న అర్హులైన లబ్ధిదారుల డేటాతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా కార్డుల ముద్రణను పూర్తి చేసి జిల్లాలకు పంపించారు. జిల్లాలకు అవసరమైన మేరకు కార్డుల నిల్వలు కూడా చేరుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పంపిణీ తేదీలు, తుది మార్గదర్శకాలు విడుదలైన వెంటనే స్థానిక రేషన్ డీలర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త వ్యవస్థ అమల్లోకి రావడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన పేదలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *