Headlines

క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. | Cooking Tips: Stop Making These 6 Cauliflower Cooking Mistakes

క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. | Cooking Tips: Stop Making These 6 Cauliflower Cooking Mistakes


భారతీయ వంటకాల్లో క్యాలీఫ్లవర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. గోబీ ఫ్రై, కర్రీ, లేదా పరాఠా.. ఇలా ఏది చేసినా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే చాలామంది ఇంట్లో క్యాలీఫ్లవర్ వండేటప్పుడు అది ముద్దగా అయిపోవడం, ముక్కలు మెత్తబడిపోయి రుచి తగ్గడం లేదా నీరు చేరడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. క్యాలీఫ్లవర్ సరిగ్గా ఉడకకపోవడానికి లేదా రుచిగా రాకపోవడానికి మనం తెలియకుండా చేసే 6 ప్రధాన పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. రెస్టారెంట్ శైలిలో గోబీ క్రిస్పీగా, రుచిగా రావాలంటే వండే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కడిగిన వెంటనే వండేయడం

చాలామంది క్యాలీఫ్లవర్‌ను నీటిలో కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే కడాయిలో వేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ అదనపు తేమ వేయించడానికి బదులు ముక్కలను ఆవిరిపై ఉడికేలా
చేస్తుంది. దీనివల్ల క్యాలీఫ్లవర్ మెత్తబడిపోయి రుచి తగ్గిపోతుంది. అందుకే కడిగిన తర్వాత నీరు పూర్తిగా ఆరిపోయేలా ఆరబెట్టడం లేదా పొడి గుడ్డతో తుడవడం తప్పనిసరి.

ముక్కలను అసమానంగా కోయడం

క్యాలీఫ్లవర్ ముక్కలను ఒకే పరిమాణంలో కాకుండా చిన్నవిగా, పెద్దవిగా అసమానంగా కోస్తే వండేటప్పుడు సమస్యలు వస్తాయి. చిన్న ముక్కలు త్వరగా ఉడికి ముద్దగా అయిపోతే.. పెద్ద ముక్కలు ఉడకకుండా పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి ముక్కలన్నీ సమాన పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.

ఫ్రై చేసేటప్పుడు మంట తగ్గించడం

గోబీని రోస్ట్ లేదా ఫ్రై చేసేటప్పుడు చాలామంది సిమ్‌లో పెడుతుంటారు. దీనివల్ల ముక్కలు కరకరలాడవు. క్యాలీఫ్లవర్‌కు మంచి క్రంచీ టెక్స్చర్, కమ్మటి సువాసన రావాలంటే దాన్ని అధిక మంట మీదనే ఫ్రై లేదా రోస్ట్ చేయాలి.

వంట ప్రారంభంలోనే ఉప్పు వేయడం

కూర వండటం మొదలుపెట్టిన వెంటనే ఉప్పు వేస్తే, క్యాలీఫ్లవర్ లోపలి నీటిని ఉప్పు బయటకు గుంజేస్తుంది. దీనివల్ల ముక్కలు గట్టిదనాన్ని కోల్పోయి నీరు చేరి ముద్దగా మారతాయి. అందుకే ఉప్పును వంట మధ్యలో లేదా దాదాపు పూర్తయ్యే సమయంలో వేస్తే క్యాలీఫ్లవర్ క్రంచీగా ఉంటుంది.

పెనం సరిగ్గా వేడెక్కకుండానే వేయడం

బాణలి లేదా పెనం సరిగ్గా వేడెక్కక ముందే గోబీ ముక్కలను అందులో వేయకూడదు. పాన్ బాగా వేడెక్కిన తర్వాత నూనె వేసి, అది కాగిన తర్వాత మాత్రమే క్యాలీఫ్లవర్ ముక్కలను వేయాలి.

వండిన వెంటనే వడ్డించడం

క్యాలీఫ్లవర్ కూర లేదా ఫ్రై కాగానే వెంటనే వడ్డించడం కంటే.. పొయ్యి ఆపేసిన తర్వాత కొన్ని నిమిషాలు దానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది. దీనివల్ల మనం వేసిన మసాలాల సువాసనలు, రుచులు క్యాలీఫ్లవర్ ముక్కలకు సరిగ్గా పడతాయి. కాగా వంట చేసేటప్పుడు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో చేసే క్యాలీఫ్లవర్ వంటకాలు రెస్టారెంట్ స్థాయి రుచితో, కరకరలాడుతూ పర్ఫెక్ట్‌గా వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *