ప్రైమ్ కోర్ క్లాక్ స్పీడ్‌ను ఏకంగా 4.2 GHz వరకు తీసుకెళ్లాలని శాంసంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2nm (SF2P) తయారీ సామర్థ్యంతో రానున్న ‘ఎగ్జినోస్ 2700’ చిప్‌సెట్, రాబోయే గెలాక్సీ S27 సిరీస్ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మొబైల్ ప్రాసెసింగ్ రంగంలో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ ఎగ్జినోస్ 2700 పూర్తి వివరాలను తెలుసుకుందాం!
భారీ క్లాక్ స్పీడ్
శాంసంగ్ సిస్టమ్ LSI విభాగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త ఎగ్జినోస్ 2700 చిప్‌సెట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ప్రైమ్ కోర్ క్లాక్ స్పీడ్‌ను ఏకంగా 4.2 GHz వరకు తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రాసెసర్లతో పోలిస్తే ఇది అత్యంత వేగవంతమైనదిగా నిలవనుంది. అయితే, ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ శాంసంగ్ ఫౌండ్రీకి చెందిన 2nm (SF2P) తయారీ సామర్థ్యం, దాని ఈల్డ్ శాతంపై ఆధారపడి ఉంటుంది. మునుపు గీక్‌బెంచ్‌లో S5E9975 మోడల్ నెంబర్‌తో కనిపించినా, తుది వెర్షన్‌లో స్పీడ్‌ను భారీగా పెంచేందుకు కంపెనీ కషపడుతోంది.
అభివృద్ధి వేగవంతం
శాంసంగ్ సిస్టమ్ LSI బిజినెస్ ప్రెసిడెంట్ పార్క్ యంగ్-ఇన్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఎగ్జినోస్ 2700 అభివృద్ధి ఎలాంటి అంతరాయాలు లేకుండా శరవేగంగా జరుగుతోంది. రాబోయే టాప్-టైర్ స్మార్ట్‌ఫోన్లలో ఈ పవర్‌ఫుల్ చిప్‌ను వాడటమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాబోయే శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ ఫోన్లలో ఈ ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ పరంగా అద్భుతమైన గేమింగ్ అనుభూతినిచ్చే ‘ఎక్స్‌క్లిప్స్ 970 GPU’, 12GB ర్యామ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్లు రూపుదిద్దుకోనున్నాయి.
మొబైల్ ప్రాసెసింగ్ రంగంలో మళ్లీ తమ పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి శాంసంగ్ గట్టిగానే ప్రణాళికలు రచిస్తోంది. ఎగ్జినోస్ 2700 రూపంలో రానున్న ఈ సరికొత్త చిప్‌సెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు, టెక్ మార్కెట్‌కు ఒక సరికొత్త అనుభూతిని అందించడం ఖాయం. అధికారిక విడుదల కోసం టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.