Headlines

చైనా-రష్యాపై కొత్త అణు వ్యూహం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అమెరికా నిర్ణయం..! | US: Donal Trump Plans New Nuclear Strategy in Case of War With China or Russia

చైనా-రష్యాపై కొత్త అణు వ్యూహం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అమెరికా నిర్ణయం..! | US: Donal Trump Plans New Nuclear Strategy in Case of War With China or Russia


చైనా,రష్యాతో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఎలా స్పందించాలనే అంశంపై అమెరికా రక్షణ శాఖ కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా ప్రస్తుతం అమలు చేస్తున్న అణు విధానంలో సంస్కరణలు చేపట్టి, సుదూర అణు క్షిపణులపై మాత్రమే ఆధారపడకుండా స్వల్ప-శ్రేణి వ్యూహాత్మక అణ్వాయుధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రముఖ న్యూస్ చానల్ కథనంలో పేర్కొంది.

ప్రస్తుతం అమెరికా అణు వ్యూహం ప్రధానంగా ప్రత్యర్థి దేశాల అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దీర్ఘ-శ్రేణి క్షిపణులపై ఆధారపడి ఉంది. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం, ప్రాంతీయ యుద్ధాలు, మిత్రదేశాలపై జరిగే పరిమిత స్థాయి దాడుల సమయంలో ఉపయోగించగల చిన్న శక్తి గల వ్యూహాత్మక అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనకు పెంటగాన్ మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా చైనా, రష్యాలు అమెరికా మిత్రదేశాలపై దాడి చేస్తే, పరిస్థితికి అనుగుణంగా విభిన్న సైనిక ప్రత్యామ్నాయాలు ఉండేలా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈ సమీక్షకు పెంటగాన్ పాలసీ చీఫ్ ఎల్‌బ్రిడ్జ్ కోల్బీ నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా అణ్వస్త్రాలకు బాధ్యత వహించే యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్‌ను సందర్శించే సందర్భంగా ఈ అంశంపై ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. సంక్షోభ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఏమీ కాదు అనే పరిస్థితి కాకుండా, అనేక ఆచరణాత్మక రక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉండేలా ఈ కొత్త వ్యూహం రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అణు నిరోధక శక్తి కోసం వాస్తవంగా ఉపయోగించగల వ్యవస్థలు ఉండాలని, అవే ప్రత్యర్థులకు బలమైన హెచ్చరికగా పనిచేస్తాయని అమెరికా రక్షణ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. తక్కువ పరిధి గల వ్యూహాత్మక అణ్వాయుధాలు మొత్తం నగరాలను లక్ష్యంగా చేసుకోవడం కాకుండా సైనిక స్థావరాలు, యుద్ధరంగ లక్ష్యాలను మాత్రమే దెబ్బతీసేలా రూపొందించారని వివరించారు.

అయితే ఈ ప్రతిపాదనపై తీవ్ర చర్చ సాగుతోంది. మద్దతుదారులు దీని వల్ల అమెరికా నిరోధక శక్తి మరింత బలపడుతుందని వాదిస్తుండగా, విమర్శకులు మాత్రం చిన్న అణ్వాయుధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటి వినియోగం సులభమవుతుందనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యుద్ధరంగంలో అణ్వాయుధాల వినియోగానికి మానసిక అడ్డంకులు తగ్గే అవకాశం ఉందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రతిపాదన ఇప్పటికే అమెరికా కాంగ్రెస్‌లో విమర్శలకు దారితీసింది. ట్రంప్ ప్రభుత్వం అణు నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయాలని చెబుతున్న సమయంలో, ఈ అధ్యయనం అందుకు విరుద్ధంగా ఉందని కొందరు సభ్యులు వ్యాఖ్యానించారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులు ప్రయోగించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగ యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించలేదు. అందువల్ల అమెరికా అణు విధానంలో ప్రతిపాదిస్తున్న ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *