Headlines

జైలుకు వెళ్లాలనే కోరిక.. ఏకంగా రూ.20 లక్షల బంగారం చోరీ చేసిన యువతి! వీడియో | I Wanted to Go to Jail: Woman Caught Stealing Rs 20 Lakh Gold Rings in Jaipur, video viral


జైపూర్, సెప్టెంబర్ 6: జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఓ యువతి ఏకంగా భారీ చోరీకి పాల్పడింది. ఉంగరం కొనుగోలు చేసే నెపంతో నగల దుకాణంలోకి వెళ్లి.. దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఉంగరాల బాక్సుతో పరారయ్యేందుకు ప్రయత్నించింది. అయితే దుకాణ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.

ఉంగరం కొనే నెపంతో షాపులోకి ఎంట్రీ..

జైపూర్‌లోని జోట్‌వారా ప్రాంతంలోని నివారు రోడ్డులో ఉన్న భవానీ జ్యువెలర్‌ షాప్‌కు సెప్టెంబర్ 3న ఓ యువతి వచ్చింది. తనకు ఉంగరం కొనాలని ఉందంటూ దుకాణ సిబ్బందిని నమ్మించింది. ఉంగరాలు చూపించాలని కోరడంతో దుకాణదారుడు ఆమెకు పలు రకాల ఉంగరాలు ఉన్న ఓ బాక్సును అందించాడు. ఆ బాక్సులో 25కు పైగా బంగారు ఉంగరాలు ఉన్నాయి. దుకాణ సిబ్బంది ఉంగరాలు చూపిస్తున్న సమయంలో యువతి అదును చూసుకుని బాక్సును తీసుకుని ఒక్కసారిగా బయటకు పరుగెత్తింది. అయితే ఆమెను గమనించిన షాప్‌ యజమాని త్రిలోక్‌చంద్ ప్రజాపత్, మరో సిబ్బందితో కలిసి వెంటనే ఆమెను వెంబడించారు. సుమారు 500 మీటర్ల దూరం వరకు వెంబడించిన అనంతరం యువతిని పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారు ఉంగరాల బాక్సును స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి



అనంతరం షాప్‌ సిబ్బంది యువతిని జోట్‌వారా పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మొత్తం చోరీ ఘటన జ్యువెల్లరీ షాప్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఉంగరాలను పరిశీలిస్తున్నట్లు నటించడం, బాక్సును తీసుకుని బయటకు పరుగెత్తడం వంటి దృశ్యాలు కెమెరాల్లో నమోదైనాయి. విచారణలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యువతి పర్సును తనిఖీ చేయగా అందులో కారం పొడి, పెప్పర్ స్ప్రే కూడా లభించాయి. దీంతో ఆమె ముందుగానే చోరీకి పక్కా ప్రణాళికతో వచ్చిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘జైలుకు వెళ్లాలనే ఇలా చేశా’

విచారణ సందర్భంగా యువతి చెప్పిన సమాధానం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తాను జైలుకు వెళ్లాలని అనుకున్నానని, అందుకే ఈ చోరీకి పాల్పడ్డానని ఆమె చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆమె ఎందుకు జైలుకు వెళ్లాలని కోరుకుంది? దాని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి ఉంగరం కొనుగోలు చేస్తానంటూ నగల షాపులోకి వెళ్లిన యువతి.. రూ.20 లక్షల విలువైన బంగారు ఉంగరాల బాక్సుతో పరారయ్యేందుకు చేసిన ప్రయత్నం చివరకు విఫలమైంది. దుకాణ సిబ్బంది అప్రమత్తతతో చోరీ జరిగిన కొద్దిసేపటికే ఆమె పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *