Headlines

టయోటా నుంచి సరికొత్త హిలక్స్ పికప్ ట్రక్.. శక్తివంతమైన ఇంజిన్ సహా పూర్తి వివరాలు | 2026 Toyota Hilux Pickup Truck Launched in India with 2.8L Diesel Engine and Advanced Features!

టయోటా నుంచి సరికొత్త హిలక్స్ పికప్ ట్రక్.. శక్తివంతమైన ఇంజిన్ సహా పూర్తి వివరాలు | 2026 Toyota Hilux Pickup Truck Launched in India with 2.8L Diesel Engine and Advanced Features!


జీఎక్స్ ఫోర్ బై టూ ఏటీ, జీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ, టాప్ ఎండ్ వీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ అనే మూడు వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుంది. ఇసుజు వీ-క్రాస్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ నయా టయోటా హిలక్స్ ట్రక్కు ప్రత్యేకతలను తెలుసుకుందాం.

మూడు వేరియంట్లు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 హిలక్స్ పికప్ ట్రక్కును టయోటా భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. న్యూ జెనరేషన్ హిలక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 31.99 లక్షలుగా నిర్ణయించింది. కొత్త డిజైన్, క్యాబిన్‌లో అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగస్టు రెండో వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కొత్త హిలక్స్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. జీఎక్స్ ఫోర్ బై టూ ఏటీ ధర రూ. 31.99 లక్షలు కాగా, జీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ ధర రూ. 33.69 లక్షలు, టాప్ ఎండ్ వీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ ధర రూ. 36.69 లక్షలుగా నిర్ణయించింది.

ఈ పికప్ ట్రక్ మార్కెట్లో ఇసుజు వీ-క్రాస్‌కు ప్రధాన పోటీదారుగా నిలవనుంది. డిజైన్ పరంగా కొత్త హిలక్స్ మరింత క్రేజీ లుక్‌ను సంతరించుకుంది. ముందు భాగంలో పెద్ద హనీకోంబ్ గ్రిల్‌పై టయోటా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, వెడల్పాటి ఎయిర్ ఇన్‌టేక్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ వాహనానికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తున్నాయి.

సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, రోల్ బార్‌లు, ఫుట్‌బోర్డ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ఓఆర్వీఎంలు, షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా అమర్చారు. వెనుక భాగంలో సీ-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ లైట్లు, టెయిల్‌గేట్‌పై టయోటా అక్షరాలు, కార్గో బెడ్‌లోకి ఎక్కడానికి ప్రత్యేక స్టెప్‌తో కూడిన కొత్త బంపర్ ఉన్నాయి.

ప్రీమియం ఇంటీరియర్

ఇంటీరియర్ కూడా పూర్తిగా అప్‌డేట్ అయింది. కొత్త డ్యాష్‌బోర్డ్‌తో పాటు 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏడు అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్‌ను అందించారు. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రత విషయంలో టయోటా ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ పరంగా 2.8 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ను అలాగే కొనసాగించారు. ఇది 204 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈసారి మాన్యువల్ గేర్‌బాక్స్‌ను తొలగించి, ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను మాత్రమే అందిస్తున్నారు. అలాగే ఫోర్ బై ఫోర్ వేరియంట్‌తో పాటు కొత్తగా ఫోర్ బై టూ ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా పరిచయం చేశారు. 2026 టయోటా హిలక్స్ కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి ఆఫ్‌రోడ్ సామర్థ్యాలతో ప్రీమియం పికప్ సెగ్మెంట్‌లో సత్తా చాటనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *