Headlines

ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌లో ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం | Nasha Mukt Yuva for Viksit Bharat program held grandly at Akshardham in Delhi

ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌లో ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం | Nasha Mukt Yuva for Viksit Bharat program held grandly at Akshardham in Delhi


ఆదివారం ఢిల్లీలోని బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌లో ‘నషా-ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది యువతీ యువకులు ఈ సభకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఏపీఎస్ కేంద్రాల్లోనూ ఇదే కార్యక్రమాన్ని ఏకకాలంలో నిర్వహించారు. సభ ప్రార్థనలు, ధున్‌తో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించాలంటే యువత వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల నుంచి విముక్తి పొందిన యువశక్తే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. వ్యసన రహిత భారత నిర్మాణంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు బీఏపీఎస్ సీనియర్ సాధువు ఈశ్వరచరణ్‌దాస్ స్వామి మాట్లాడుతూ.. భగవాన్ స్వామినారాయణ్ బోధించిన వ్యసన రహిత జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. ప్రధాని మోదీ చేపట్టిన ఈ ప్రచారానికి యువత పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ, బీఏపీఎస్ నిర్వహిస్తున్న యువజన కార్యక్రమాలను అభినందించారు. యువత తమ శక్తిని సృజనాత్మక పనుల వైపు మళ్లించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశవ్యాప్తంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు, మై భారత్ వాలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఇతర విద్యాసంస్థల ప్రతినిధులు కలిపి 10 వేలకుపైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. వ్యసన విముక్తి కోసం బీఏపీఎస్ గత మూడు దశాబ్దాలుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 1997లో గుజరాత్‌లో వ్యసన విముక్తి శిబిరాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం, 2000లో పిల్లల ద్వారా ఇంటింటికీ ప్రచారం, 2007లో దేశవ్యాప్తంగా 21 లక్షల మందికి చేరుకున్న అవగాహన కార్యక్రమం, 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారీ ప్రచారంతో కొనసాగింది. ప్రముఖ్ స్వామి మహారాజ్ ప్రేరణతో లక్షలాది మంది వ్యసనాలను విడిచిపెట్టి సద్గుణ జీవితాన్ని స్వీకరించగా, ప్రస్తుతం మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *