Headlines

తల్లిదండ్రుల ముఖంలో ఆ చిరునవ్వు కోసం.. కొడుకు చేసిన అద్భుత ప్రయాణం..! | Khemu Saini’s Inspiring Journey: From Poverty to Fulfilling Parents’ Flight Dream


ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండి.. సంకల్పం బలంగా ఉంటే పేదరికం కూడా లొంగిపోతుందని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు ఖేము సైని. తాను పడ్డ కష్టాలను అధిగమిస్తూ.. తన తల్లిదండ్రులకు, సోదరికి జీవితంలో మరచిపోలేని అనుభూతిని అందించాడు. కుటుంబంతో కలిసి తొలిసారి విమానంలో ప్రయాణించిన ఖేము సైని కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది.

ఒకప్పుడు నెలకు కేవలం రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు మాత్రమే సంపాదించే ఖేము.. కుటుంబాన్ని పోషించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణం చేయడం అనేది అతని కుటుంబానికి ఒక కలగానే ఉండేది. అయితే పరిస్థితులను చూసి వెనక్కి తగ్గకుండా కష్టపడి పనిచేశాడు. తన సంపాదనను పొదుపు చేస్తూ.. ఒకరోజు తన తల్లిదండ్రులను విమానంలో తీసుకెళ్లాలనే కలను నెరవేర్చుకున్నాడు.

తొలి విమాన ప్రయాణానికి సంబంధించిన దృశ్యాలను @tijara_vines01 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కుటుంబ సభ్యులు సంప్రదాయ రాజస్థానీ ధోతీ-కుర్తా దుస్తుల్లో విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి విమానం ఎక్కే వరకు తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విమానం టేకాఫ్ అయిన సమయంలో వారి ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు, ఆశ్చర్యం, ఆనందం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేశాయి. తమ జీవితంలో ఇంతకాలం కలగానే ఉన్న విమాన ప్రయాణాన్ని కుమారుడు సాకారం చేయడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘ఇదే నిజమైన విజయం’’, ‘‘తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే అసలైన సంపాదన’’, ‘‘కష్టపడితే కలలు నిజమవుతాయి’’ అంటూ ఖేము సైనిని ప్రశంసిస్తున్నారు. ఖేము కథ కేవలం ఒక విమాన ప్రయాణం గురించి కాదు. పేదరికం మనిషి కలలకు అడ్డంకి కావచ్చు కానీ.. సంకల్పానికి మాత్రం కాదనే సందేశాన్ని ఇస్తోంది. తక్కువ ఆదాయం నుంచి ప్రారంభించిన అతని ప్రయాణం.. ఈరోజు తన కుటుంబానికి గర్వకారణంగా మారింది. తల్లిదండ్రుల కోసం చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఖేముకు జీవితంలో అతిపెద్ద విజయంగా నిలిచింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *