Headlines

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. పోలీసుల కీలక సూచనలు! | Tirumala Car Theft Accused Arrested: Police Recover iPhones, Cash, Issue Safety Advisory

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. పోలీసుల కీలక సూచనలు! | Tirumala Car Theft Accused Arrested: Police Recover iPhones, Cash, Issue Safety Advisory


తిరుమల శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తుల భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాలతో తిరుమలలోని పార్కింగ్ ప్రాంతాల్లో గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాంబగీచ కార్ పార్కింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రుధ్ర శ్యామ్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

గత కొన్ని రోజులుగా తిరుమలలోని వివిధ కార్ పార్కింగ్ ప్రాంతాల్లో భక్తుల వాహనాల అద్దాలు పగులగొట్టి, కార్లలోని విలువైన వస్తువులను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో తమ వాహనాల్లో బ్యాగులు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర విలువైన వస్తువులను ఉంచుతున్న విషయాన్ని గమనించి, ముందుగా వాహనాలను పరిశీలించి లక్ష్యంగా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. నిందితుడు కార్ల అద్దాలను పగులగొట్టి, వాహనాల్లోని విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడు ఇప్పటి వరకు చేసిన చోరీలు

  • రాంబగీచ కార్ పార్కింగ్‌లో ఒక వాహనం అద్దం పగులగొట్టి నగదు చోరీ చేశాడు.
  • 02-08-2026న నారాయణగిరి, ATGH సమీపంలో ఒక కార్ అద్దం పగులగొట్టి ల్యాప్‌టాప్ బ్యాగ్ తదితర వస్తువులను చోరీ చేశాడు.
  • 03-08-2026న VQC-1 సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద TG-30-6666 నంబరు గల ఫార్చునర్ వాహనం అద్దాలు పగులగొట్టి కార్లోని 3 ఐఫోన్స్, ఒక ఐ వాచ్, రూ.45,000 నగదు కాజేశాడు.

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకన్న వస్తువులు

ఈ కేసు పట్టుబడిన నిందితుడి నుంచి పోలీసులు రెండు ఐఫోన్స్, ఒక ఐవాచ్, కార్ల అద్దాలు పగులగొట్టేందుకు ఉపయోగించిన రెండు పనిముట్లు, ఒక Dell కంపెనీ బ్యాగ్, నేరాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత కేసుల్లో చోరీ సొత్తుగా గుర్తించి, నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.

భక్తులకు తిరుపతి జిల్లా పోలీసుల సూచనలు.

ఈ ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ భక్తులకు కొన్ని కీలక సూచనలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాల్లో విలువైన వస్తువులను ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కారు పార్క్ చేసి దర్శనానికి వెళ్లే ముందు నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, విలువైన డాక్యుమెంట్లు, ఇతర ఖరీదైన వస్తువులను వాహనంలో ఉంచకూడదన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో వస్తువులను వాహనంలో ఉంచాల్సి వస్తే అవి బయటకు కనిపించకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలన్నారు. అధికారికంగా గుర్తించబడిన, భద్రతా సిబ్బంది, CCTV నిఘా ఉన్న నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్ చేయాలన్నారు. రోడ్డుపక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో లేదా అనధికారిక ప్రదేశాల్లో వాహనాలను పార్క్ చేయకూడదని సూచించారు.

వాహనాన్ని లాక్ చేసే సమయంలో అన్ని డోర్లు, విండోలు సరిగ్గా లాక్ అయ్యాయో నిర్ధారించుకోవాలని.. వాహనంలో విలువైన వస్తువులు ఉన్నట్లు బయటకు కనిపించే విధంగా బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగులు, పర్సులు, మొబైల్ ఫోన్లు ఉంచకూడదన్నారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందికి లేదా Dial-112కు సమాచారం అందించాలని.. తిరుమలలో భక్తుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, భక్తులు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *