Headlines

Telangana: వారెవ్వా.. తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు.. | Telangana Smart Ration Cards to Get 9 Advanced Security Features to Prevent Fake Cards

Telangana: వారెవ్వా.. తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు.. | Telangana Smart Ration Cards to Get 9 Advanced Security Features to Prevent Fake Cards


తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులకు పటిష్ట భద్రతా ప్రమాణాలు కల్పిస్తోంది. నకిలీ కార్డుల తయారీకి అవకాశం లేకుండా, కార్డు అసలుదనాన్ని సులభంగా గుర్తించేలా సివిల్ సప్లయ్స్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల్లో ఉపయోగించే భద్రతా విధానాలను స్మార్ట్ రేషన్ కార్డుల్లోనూ అమలు చేస్తున్నారు. మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో కార్డు డిజైన్‌ను రూపొందించారు. కార్డులోని వివరాలను సాధారణంగా చూడటమే కాకుండా.. ప్రత్యేక పరికరాలు, స్పర్శ, డిజిటల్ ధ్రువీకరణ ద్వారా కూడా అసలుదనాన్ని నిర్ధారించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు.

కార్డుపై కీలక వివరాలు

స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలతో పాటు లబ్ధిదారుడి వివరాలు, రేషన్ దుకాణం నంబర్ వంటి సమాచారాన్ని పొందుపరచనున్నారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్ అధికారిక సంతకానికి కూడా స్థానం కల్పించారు. కార్డు ముందు, వెనుక భాగాల్లో కనిపించే, కనిపించని, స్పర్శ ద్వారా గుర్తించగలిగే, డిజిటల్‌గా ధ్రువీకరించగలిగే భద్రతా అంశాలను కలిపి రూపొందించారు.

హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్

తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్‌తో పాటు ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ రిలీఫ్ టెక్స్ట్‌ను కార్డులో పొందుపరచనున్నారు. అత్యంత సూక్ష్మ అక్షరాలతో మైక్రో టెక్స్ట్‌ను కూడా ముద్రించనున్నారు. భూతద్దంతో పరిశీలించినప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపించేలా ఉండే ఈ మైక్రో టెక్స్ట్‌ను సాధారణ ప్రింటింగ్ పద్ధతులతో కాపీ చేయడం కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు.

యాంగిల్ మార్చితేనే కనిపించే రహస్య గుర్తులు

కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ ప్రత్యేక భద్రతా ఫీచర్‌గా ఉండనున్నాయి. ‘GOTG’ వంటి రహస్య గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదా మాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించారు. దీంతో కార్డు అసలుదనాన్ని పరిశీలించేందుకు మరో అదనపు మార్గం అందుబాటులోకి వస్తుంది.

యూవీ లైట్‌లో కనిపించే లోగో

సాధారణ కంటికి కనిపించని ప్రత్యేక యూవీ లోగోను కార్డుపై ముద్రించనున్నారు. అల్ట్రా వయొలెట్ లైట్‌లో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తుంది. కార్డు నిజమైనదా.. నకిలీదా అనే విషయాన్ని వేగంగా గుర్తించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.

గిల్లోష్ ప్యాటర్న్‌తో మరో భద్రతా పొర

కార్డు బ్యాక్‌గ్రౌండ్‌లో సంక్లిష్టమైన గిల్లోష్ ప్యాటర్న్‌ను ఉపయోగించనున్నారు. గణిత సూత్రాల ఆధారంగా అత్యంత కచ్చితత్వంతో రూపొందించే ఈ రేఖా ఆకృతిని సాధారణ పద్ధతుల్లో నకలు చేయడం కష్టం. ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో కలిసి ఈ ప్యాటర్న్ కార్డుకు అదనపు రక్షణ పొరగా పనిచేయనుంది.

ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్

స్మార్ట్ రేషన్ కార్డు వెనుక భాగంలో 20×20 మిల్లీమీటర్ల ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నారు. ఇందులో భద్రతకు సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని పొందుపరుస్తారు. అధికారిక సాఫ్ట్‌వేర్ లేదా అనుమతించబడిన స్కానింగ్ వ్యవస్థ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లబ్ధిదారుడి వివరాలను ధ్రువీకరించేలా వ్యవస్థను రూపొందించారు. డేటాలో అనధికార మార్పులు, డూప్లికేషన్, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.

స్పర్శతోనూ గుర్తించేలా ఎంబోస్డ్ అక్షరాలు

కార్డుపై కొన్ని అక్షరాలు, వివరాలను ఎంబోస్ చేయనున్నారు. వీటిని చేతితో తాకినప్పుడు గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో కార్డు భద్రతా ప్రమాణాలను కేవలం కళ్లతోనే కాకుండా స్పర్శ ద్వారా కూడా పరిశీలించవచ్చు.

డూప్లికేట్లకు చెక్ పెట్టడమే లక్ష్యం

స్మార్ట్ రేషన్ కార్డుల్లో అమలు చేస్తున్న ఈ భద్రతా ఫీచర్లన్నింటినీ కలిపి ఉపయోగించడం ద్వారా నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడంతో పాటు, లబ్ధిదారుల వివరాల డిజిటల్ ధ్రువీకరణకు అవకాశం ఏర్పడనుంది. కార్డు అసలుదనాన్ని త్వరగా గుర్తించేలా రూపొందించిన ఈ విధానం ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *