
తెల్లని బట్టలు ధరించడం చాలా మందికి ఇష్టం. అవి చూడటానికి ఆకర్షణీయంగా, శుభ్రంగా కనిపిస్తాయి. అయితే వాటి తెల్లదనాన్ని ఎక్కువకాలం అలాగే నిలుపుకోవడం అంత సులభం కాదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తెల్లని బట్టలు క్రమంగా పసుపు రంగులోకి మారి వాటి మెరుపును కోల్పోతాయి. చాలామంది మరకలు తొలగించేందుకు బ్లీచ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే బ్లీచ్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల బట్టల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాలతో తెల్లని బట్టలను శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.
ఉప్పుతో తెల్లదనాన్ని కాపాడండి
తెల్లని బట్టలను ఉతికే ముందు గోరువెచ్చని నీటిలో 1–2 టీస్పూన్ల ఉప్పు కలపండి. ఆ నీటిలో బట్టలను 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టి, తర్వాత డిటర్జెంట్‌తో ఉతకండి. ఇలా చేయడం వల్ల బట్టలు పసుపు రంగులోకి మారే అవకాశం తగ్గుతుంది.
వెనిగర్‌తో మరకలు, దుర్వాసనకు చెక్
బట్టలు ఉతికే నీటిలో అర టీస్పూన్ వెనిగర్ కలిపితే తెల్లని బట్టల మెరుపు నిలిచి ఉంటుంది. అలాగే చెమట వాసన, తేలికపాటి మరకలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. వాషింగ్ మెషీన్‌లో ఉతికేటప్పుడు కూడా వెనిగర్‌ను ఉపయోగించవచ్చు.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో మెరుపు
తెల్లని బట్టలపై ఉన్న మరకలను తొలగించడంతో పాటు పసుపు రంగు రాకుండా ఉండేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి బట్టలను కొంతసేపు నానబెట్టి ఉతికితే మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసంతో సహజమైన తెల్లదనం
2–3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని నీటిలో కలిపి, తెల్లని బట్టలను 1 నుంచి 2 గంటల పాటు అందులో నానబెట్టండి. ఆ తర్వాత డిటర్జెంట్‌తో ఉతికితే బట్టలపై ఉన్న దుర్వాసన తొలగిపోవడమే కాకుండా, సహజమైన తెల్లదనం కూడా నిలిచి ఉంటుంది.
బేకింగ్ సోడాతో కొత్తలాంటి మెరుపు
ఒక బకెట్ నీటిలో 1–2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి, తెల్లని బట్టలను 30 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత సాధారణంగా సబ్బు లేదా డిటర్జెంట్‌తో ఉతకండి. ఇది మరకలను తగ్గించి, బట్టల మెరుపును ఎక్కువకాలం నిలుపుతుంది.
తెల్లని బట్టల అందాన్ని కాపాడుకోవాలంటే వాటిని రంగు బట్టలతో కలిసి ఉతకకుండా ఉండటం మంచిది. అలాగే బట్టలపై ఉన్న సంరక్షణ సూచనలను (Care Label) తప్పకుండా పాటించాలి. బ్లీచ్, వెనిగర్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి పదార్థాలను ఉపయోగించే ముందు బట్టలో కనిపించని చిన్న భాగంలో పరీక్షించడం కూడా ఉత్తమం. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే, మీ తెల్లని బట్టలు ఎక్కువకాలం కొత్తవాటిలా మెరిసిపోతాయి.