Headlines

దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు! | Holiday for schools in most of Telangana districts due to heavy rains

దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు! | Holiday for schools in most of Telangana districts due to heavy rains


ఆదిలాబాద్, జులై 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో స్కూళ్లకు గురువారం కూడా సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కుస్తున్న వానల కారణంగా బుధవారం (జులై 29)న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. గురువారం కూడా భారీ వర్షాలు కొనసాగడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించాయి. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వర్షాల దృష్ట్యా నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ , నిజామాబాద్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల విద్యా అధికారులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే శుక్రవారం (జులై 31) కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు తక్షణ అత్యవసర సహాయం అందించేందుకు ఆసిఫాబాద్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ కె హరిత తెలిపారు. తమ సమస్యలను తెలియజేయడానికి, అత్యవసర పరిస్థితుల్లో 85008 44365 నంబర్‌ను సంప్రదించాలని ఆమె ప్రజలకు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె వారిని అభ్యర్థించారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కొండ వాగులు, సెలయేళ్లు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతలమనేపల్లి, దహేగావ్, పెంచికల్‌పేట్, బెజ్జూరు, కౌటాల, సిర్‌పూర్ (టి) మండలాల్లో వరదల వల్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో అనేక గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. ఒక్క బెజ్జూరు మండలంలోనే సుమారు 10 గ్రామాలు వరదల్లో చిక్కుకుపోయాయి.

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నీరు తరలి వచ్చి చేరింది. కాడెం మండల కేంద్రంలోని కద్దం నారాయణారెడ్డి ప్రాజెక్టులోకి 77,442 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 700 అడుగులు (3.495 టీఎంసీలు). అయితే ఇప్పటికే నీటిమట్టం 693 అడుగులకు చేరింది. మొత్తం 18 గేట్లలో ఆరింటిని ఎత్తివేసి అదనపు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 121.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. బెజ్జూరు మండలంలో అత్యధికంగా 183.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెంచికల్‌పేట మండలంలో 165.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దహెగాం, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్ (టి), కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం మండలాల్లో 110 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

జూన్ 1 నుంచి జూలై 30 వరకు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సాధారణంగా 536.2 మి.మీ. వర్షపాతం నమోదు కావల్సి ఉండగా.. ఇప్పటి వరకు 550 మి.మీ.గా నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో సగటున 102.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మందమర్రి మండలంలో అత్యధికంగా 161 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో బెల్లంపల్లి మండలంలో 155.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాసిపేట, వేమనపల్లి, నెన్నాల్, మంచిర్యాల, నాస్‌పూర్, జైపూర్‌లలో 100 మి.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. ఈ రుతుపవన కాలంలో ఇప్పటివరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 467.3 మి.మీ. కాగా, మంచిర్యాల జిల్లాలో వాస్తవ వర్షపాతం 517 మి.మీ.గా నమోదైంది. ఇది 11 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 64.6 మి.మీ.గా నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో 54.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల్లోని అధిక శాతం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో సగటున 81.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో వరుసగా 77 మి.మీ, 45.3 మి.మీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ సగటు వర్షపాతం 29.8 మి.మీ కాగా, కామారెడ్డి జిల్లాలో 25.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *