Hindu Temple Pradakshina Benefits Telugu: దేవాలయానికి వెళ్లినప్పుడు చాలామంది ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. సాధారణంగా మూడు ప్రదక్షిణలతో మొదలుపెట్టి, తమ మొక్కుబడులు లేదా విశ్వాసాన్ని బట్టి 5, 7, 9, 11, 21, 108 ప్రదక్షిణలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందని ఆధ్యాత్మిక, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అష్టాదశ పురాణాల్లోని పద్మ పురాణం, స్కాంద పురాణాల్లో ప్రదక్షిణల మహిమను వివరించే శ్లోకాలు ఉన్నాయని, ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి సత్ఫలితాలు లభిస్తాయో కూడా పురాణాల్లో వివరించినట్లు పేర్కొంటున్నారు. మరి పురాణాల ప్రకారం దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు? ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల్లో పేర్కొన్న విశ్వాసాల ప్రకారం.. ప్రదక్షిణ అనేది కేవలం ఆలయం చుట్టూ తిరగడం మాత్రమే కాదు. భగవంతుడిని మన జీవితానికి కేంద్రంగా భావిస్తూ ఆయన చుట్టూ పరిభ్రమించడం అనే ఆధ్యాత్మిక భావన కూడా ఇందులో దాగి ఉంది.
ప్రదక్షిణ అంటే ఏమిటి?
‘ప్రదక్షిణ’ అనే పదానికి భగవంతుడి చుట్టూ తిరగడం అనే అర్థం ఉంది. ఆలయంలోని దైవమూర్తిని కేంద్రంగా ఉంచుకుని కుడివైపు నుంచి పరిభ్రమించడాన్ని ప్రదక్షిణగా పరిగణిస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే.. మన జీవితంలో భగవంతుడే కేంద్రబిందువు అనే భావనతో ప్రదక్షిణ చేస్తారు. మనసు, మాట, శరీరాన్ని భగవంతుడిపై కేంద్రీకరించుకుని ఆలయం చుట్టూ తిరగడం ద్వారా భక్తి భావం మరింత పెరుగుతుందని విశ్వాసం. కొన్ని సంప్రదాయ వివరణల్లో ప్రదక్షిణ విధానాన్ని భ్రమర కీటక న్యాయం, అయస్కాంత న్యాయం వంటి ఉదాహరణలతో కూడా వివరిస్తారు. భక్తి, ఏకాగ్రతతో పదేపదే దైవాన్ని స్మరించడం ద్వారా మనసులో కూడా ఆ దైవ భావన బలపడుతుందని ఆధ్యాత్మిక భావన.
ప్రదక్షిణలతో పాపాలు తొలగుతాయా?
పద్మ పురాణంలో ప్రదక్షిణల విశిష్టతను తెలియజేసే శ్లోకం ఉందని చెబుతారు.
ఇవి కూడా చదవండి
“ప్రకర్షేన క్షయం యాతి పాపం సర్వం త్రిధాకృతమ్ | క్షీణత్వేంచగతే పాపే ప్రదక్షిణమితి శ్రుతమ్ ||”
ఈ శ్లోకానికి సంబంధించిన సంప్రదాయ వ్యాఖ్యానం ప్రకారం.. ప్రదక్షిణలు చేయడం ద్వారా కాయిక, వాచిక, మానసిక పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అంటే శరీరంతో చేసిన తప్పులు, మాటల ద్వారా చేసిన తప్పులు, మనసులో కలిగిన చెడు ఆలోచనలు వంటి మూడు రకాల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణ భావన.
ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఏ ఫలితం?
స్కాంద పురాణంలో ప్రదక్షిణల సంఖ్యకు అనుగుణంగా వివిధ ఫలితాలను వివరించే శ్లోకం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
- “ఏకేన జన్మజం పాపం ద్వాభ్యాం నస్యతి నిశ్చయః
- త్రిభిస్తు సర్వసంహారః పంచబిహి శత్రు నాశనం
- సప్తబిహి సకలైశ్వర్యం నవబిహి సర్వకామదం
- రుద్ర సంఖ్యైహి సుఖం ప్రోక్తం కోటిభిర్ మోక్ష ముచ్యతే ||”
ఈ శ్లోకానికి సంబంధించిన సంప్రదాయ అర్థం ప్రకారం ప్రదక్షిణల సంఖ్యను బట్టి ఫలితాలను ఇలా చెబుతారు.
1 ప్రదక్షిణ: ఒక్కసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలు తొలగుతాయని పురాణ విశ్వాసం.
2 ప్రదక్షిణలు: రెండు ప్రదక్షిణలు చేస్తే ఈ జన్మతో పాటు గత జన్మలకు సంబంధించిన పాపాలు కూడా తొలగుతాయని చెబుతారు.
3 ప్రదక్షిణలు: మూడు ప్రదక్షిణలు చేస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నట్లు సంప్రదాయ వ్యాఖ్యానం.
5 ప్రదక్షిణలు: శత్రు బాధలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు ఐదు ప్రదక్షిణలు చేయాలని ఈ శ్లోకం సూచిస్తుందని చెబుతారు.
7 ప్రదక్షిణలు: ఏడు ప్రదక్షిణలు చేస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణ విశ్వాసం.
9 ప్రదక్షిణలు: మనసులోని కోరికలు, మనోభీష్టాలు నెరవేరాలని కోరుకునేవారు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలని సంప్రదాయంలో చెబుతారు.
11 ప్రదక్షిణలు: పదకొండు ప్రదక్షిణలు చేస్తే జీవితంలో సుఖసంతోషాలు, సౌఖ్యాలు కలుగుతాయని పురాణ విశ్వాసం.
కోటి ప్రదక్షిణలు
జీవితకాలంలో వివిధ దేవాలయాలను దర్శించుకుంటూ చేసిన ప్రదక్షిణలు మొత్తం కోటి సంఖ్యకు చేరితే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నట్లు సంప్రదాయ వ్యాఖ్యానాలు చెబుతున్నాయి.
ప్రదక్షిణలో అసలు ముఖ్యమైనది ఏంటి?
ప్రదక్షిణల సంఖ్య కంటే భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతే ముఖ్యమని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతారు. తొందరగా ప్రదక్షిణలు పూర్తి చేయడం కంటే భగవంతుడిని స్మరిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ప్రదక్షిణ చేయడం ఆధ్యాత్మికంగా మరింత అర్థవంతంగా భావిస్తారు. అలాగే ప్రతి ఆలయంలో ప్రదక్షిణ చేసే విధానం ఒకేలా ఉండదు. కొన్ని ఆలయాల్లో ప్రత్యేక ఆచారాలు, నియమాలు ఉంటాయి. కాబట్టి ఆయా ఆలయ సంప్రదాయాలను పాటించడం మంచిది .
(Disclaimer: దేవాలయం చుట్టూ చేసే ప్రతి ప్రదక్షిణ భక్తుడిని భగవంతుడికి మరింత చేరువ చేసే ఆధ్యాత్మిక సాధనగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. పురాణాల్లో చెప్పిన ఈ ఫలితాలు ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించినవే; వాటిని శాస్త్రీయంగా నిరూపితమైన ఫలితాలుగా భావించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)