ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక ఎమోషనల్ విషయాన్నీ పంచుకున్నారు. “మహాత్మ” చిత్రంలో శాస్త్రి గారు రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు గాంధీ” పాటలో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం జరిగిందని, ఆ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో బోనాల సాంగ్ మధ్యలో వచ్చే రెండరింగ్ కూడా తానే పాడి, నటించానని తెలిపారు. అప్పుడు పొడవాటి జుట్టుతో ఉన్నానని, అది ఒక మొక్కు అని కూడా చెప్పారు. శ్యామ్ తండ్రి మధుసూదన్ రావు గారు వరంగల్ హనుమకొండకు చెందిన రంగస్థల నటులు. ఆయనను “హనుమకొండ శోభన్ బాబు” అని పిలిచేవారట. వరంగల్‌లో విజయ్ కుమార్ అనే నటుడిని “వరంగల్ శోభన్ బాబు” అని పిలిచేవారని, తన తండ్రి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో తన పోలికలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని శ్యామ్ వివరించారు. మోహన్ బాబు వంటి ప్రముఖులు కూడా తన డీపీలోని ఫోటో చూసి తండ్రిని గొప్ప నటుడిగా అభివర్ణించారని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ, సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఐదేళ్లపాటు కుటుంబాన్ని వరంగల్‌లో వదిలిపెట్టి చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించారని శ్యామ్ భావోద్వేగంతో పంచుకున్నారు.
“తల్లి దీవెన”, “మంచికి స్థానం లేదు”, “రోజులు మారాయి”, “చలి చీమలు” వంటి సుమారు 26 చిత్రాలలో ఆయన నటించారు. దేవదాస్ కనకాల గారు తన తండ్రికి వేషం ఇచ్చారని, ఈ విషయాన్ని తాను రాజీవ్ కనకాల గారికి కూడా చెప్పానని అన్నారు. అయినప్పటికీ, సినిమా రంగంలో విజయం సాధించలేక, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం తన కలను వదులుకొని వరంగల్‌కు తిరిగి వచ్చారని శ్యామ్ వివరించారు. అప్పుడు తన తండ్రి సినీ రంగంలో కష్టాలు చెప్పి, నటనకు బదులుగా బుద్ధిని, టెక్నికల్‌గా లేదా సాహిత్యపరంగా సినిమా రంగంలోకి వెళ్ళమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అందుకే నటనను లోపల దాచిపెట్టి, గేయ రచయితగా మారానని శ్యామ్ చెప్పారు.
తన విద్యాభ్యాసం గురించి మాట్లాడుతూ, తాను ఇంటర్లో ఎంపీసీ, తర్వాత బీఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశానని, ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిల్ జానపద కళలు అభ్యసించానని తెలిపారు. ఈ క్రమంలోనే తనకు డప్పు వాయించడంలో ప్రావీణ్యం వచ్చిందని, తమ గురువులు వరంగల్ శంకర్, సారంగపాణి అన్నలు మీడియా లేని కాలంలోనే జానపదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. తమకు డప్పు నేర్పిన సూర్య భగవాన్ రావు గారిని కృతజ్ఞతతో స్మరించుకున్నారు. “అరి” సాంగ్ లాంచ్ సమయంలో సాయికుమార్ పక్కన తబలా కొట్టినప్పుడు, అది నటన అని, నిజానికి తాను డప్పు కళాకారుడినని శ్యామ్ వివరించారు. డప్పు కళాకారులు ఇప్పుడు కరువవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా కాసర్ల శ్యామ్ రాచించిన ఏష నాగుల కట్ట సాంగ్ ఎంత పెద్ద విజయం సాదించిందతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి