Headlines

నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం | Serial Tiger Deaths in Nallamala Trigger Alarm; Andhra Government Forms High Level Probe Committee

నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం | Serial Tiger Deaths in Nallamala Trigger Alarm; Andhra Government Forms High Level Probe Committee


నల్లమల అడవుల్లో వరుసగా పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌లలో ఒకటైన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు పర్యావరణవేత్తలను కలవరపెడుతున్నాయి. పులుల మరణాలకు అసలు కారణమేంటి? ప్రభుత్వం ఎందుకు హై లెవల్ కమిటీ వేసింది? ఇప్పుడు నల్లమలలో ఏం జరుగుతోంది?

పెద్దపులులకు ఏమవుతోంది..?

నల్లమల… పెద్దపులులకు సురక్షిత ఆవాసంగా పేరొందిన అడవి. కానీ ఇప్పుడు అదే అడవిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో ఘటన బయటపడుతున్న కొద్దీ అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అక్రమ వేటగాళ్ల ఉచ్చులా..? విష ప్రయోగమా..? విద్యుత్ తీగలా..? లేక సహజ కారణాలా..? అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలతో నల్లమలలో పులుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మానవ జోక్యమే ప్రమాదమా?

అడవుల పరిధి తగ్గడం… అటవీ అంచుల్లో మానవ కార్యకలాపాలు పెరగడం… పులుల జీవనంపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం, నీటి కోసం అడవి దాటి జనావాసాలకు చేరుతున్న పులులు ప్రమాదాలకు గురవుతున్నాయి. పశువులపై దాడులకు ప్రతీకారంగా విష ప్రయోగాలు, అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసే ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు వయసు, వ్యాధులు, ఆధిపత్య పోరాటాలు కూడా కొన్ని మరణాలకు కారణమయ్యే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వం అప్రమత్తం… హై లెవల్ కమిటీ రంగంలోకి

పులుల వరుస మరణాలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. జీవో ఆర్‌టీఈ నెంబర్ 91 ద్వారా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పి. మల్లిఖార్జున రావు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సంఘటన స్థలాలను పరిశీలించి 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరణాలకు గల అసలు కారణాలను గుర్తించి నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

పులుల సంరక్షణకు కొత్త కార్యాచరణ

విచారణతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. వేట నిరోధక చర్యలు బలోపేతం చేయడం, అడవుల్లో పెట్రోలింగ్ పెంచడం, హనుమాన్ ప్రాజెక్ట్ ద్వారా మానవ-వన్యప్రాణి సంఘర్షణ తగ్గించడం, వైల్డ్‌లైఫ్ కారిడార్లను శాస్త్రీయంగా సంరక్షించడం, స్థానిక ప్రజలకు కమ్యూనిటీ ఈకో-టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలపై రెండు నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది.

GO ముఖ్యాంశాలు

  • నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులుల మరణాలపై విచారణకు హై లెవల్ కమిటీ ఏర్పాటు
  • రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పి. మల్లిఖార్జున రావు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ
  • 72 గంటల్లో క్షేత్రస్థాయి విచారణ చేసి ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశం
  • మరణాల కారణాలపై నిజనిర్ధారణకు ప్రత్యేక దర్యాప్తు
  • అక్రమ వేట నిరోధక చర్యలు, అటవీ పెట్రోలింగ్ బలోపేతంపై అధ్యయనం
  • హనుమాన్ ప్రాజెక్ట్ ద్వారా మానవ-వన్యప్రాణి సంఘర్షణ తగ్గించే కార్యాచరణ
  • వైల్డ్‌లైఫ్ కారిడార్ల సంరక్షణ, సైంటిఫిక్ మానిటరింగ్‌పై ప్రత్యేక బ్లూప్రింట్
  • కమ్యూనిటీ ఈకో-టూరిజం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించే సిఫార్సులు
  • రెండు నెలల్లో సమర్పించాలని కమిటీకి ఆదేశాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *