Headlines

నాటు కోడి స్టైల్లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు.. ముక్క సాఫ్ట్‌గా మారుతుంది | Chicken Curry Recipe: Andhra Style Tips to Remove Raw Smell and Make Chicken Soft and Tasty

నాటు కోడి స్టైల్లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు.. ముక్క సాఫ్ట్‌గా మారుతుంది | Chicken Curry Recipe: Andhra Style Tips to Remove Raw Smell and Make Chicken Soft and Tasty


ఆదివారం అంటే నాన్ వెజ్ ప్రియుల ఇళ్లల్లో చికెన్ ఉండాల్సిందే.. చాలా మంది చికెన్ ను తెచ్చుకుని ఇష్టంగా వండుకుని తింటారు. కర్రీ, ఫ్రై ఇంకా.. అనేక రకాల పద్దతుల్లో చికెన్ ను వండుకుంటారు.. అయితే.. చికెన్ వండినప్పటికీ.. కొన్ని టిప్స్ పాటించకపోవడం వల్ల కర్రీ నీచు వాసన వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో.. ఆంధ్రా స్టైల్ లో ఒక ప్రత్యేకమైన చికెన్ కూర తయారీ విధానాన్ని ఈ కథనంలో అందిస్తున్నాం. ఈ రెసిపీని అనుసరించి, మీరు నీచు వాసన లేని, కమ్మని రుచితో కూడిన చిక్కని గ్రేవీతో చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతి చికెన్ ప్రియులకు ఖచ్చితంగా నచ్చుతుంది.

చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, పసుపు (చికెన్ శుభ్రం చేయడానికి)

నూనె, ఉల్లిపాయలు -3 వరకు మిక్సీ పట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, కారం (మీ కారానికి తగ్గట్టు), ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా..

తయారీ విధానం:

చికెన్ శుభ్రపరచడం: ముందుగా చికెన్‌ను తీసుకోండి. దీనికి కొద్దిగా పసుపు వేసి, బాగా కలిపి శుభ్రంగా కడగాలి. ఈ ప్రక్రియ వల్ల చికెన్‌లోని నీచు వాసన అస్సలు రాకుండా, కూర మంచి రుచిగా ఉంటుంది. శుభ్రం చేసుకున్న చికెన్‌ను పక్కన పెట్టుకోండి.

నూనెలో వేయించడం: స్టవ్ వెలిగించి, కళాయి పెట్టుకోండి. ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయండి. నూనె కాగిన తర్వాత, మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ పీస్‌లను మొత్తాన్ని వేయండి. నాన్ వెజ్ కూరలకు కాస్త ఎక్కువ నూనె అవసరం పడుతుంది.

మగ్గనివ్వడం: చికెన్‌ను నూనెలో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలపండి. తర్వాత మూత పెట్టి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఈ సమయంలో మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చికెన్‌లోని నీరంతా బయటికి వచ్చి, ఆ నీరు మొత్తం ఇంకిపోయి, నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ఈ ప్రక్రియకు పదిహేను నిమిషాల వరకు సమయం పట్టవచ్చు. చికెన్ పీస్‌లు మంచి కలర్‌లో ఫ్రై అవుతాయి.

ఉల్లి ముద్ద వేయడం: చికెన్ పీస్‌లు బాగా వేగిన తర్వాత, మూడు మధ్యస్థాయి ఉల్లిపాయలను బరక బరకగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. ఈ ఉల్లి ముద్దను చికెన్ పీస్‌లతో కలిపి, పచ్చివాసన పోయేంత వరకు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించాలి. ఉల్లి ముద్ద మంచి కలర్‌లో వేగితేనే గ్రేవీ చిక్కగా, రుచిగా వస్తుంది.

అల్లం వెల్లుల్లి పేస్ట్ – పచ్చిమిర్చి: ఉల్లి ముద్ద వేగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చిని ఈ దశలో వేయడం వల్ల వాటి ఫ్లేవర్ చికెన్‌కు బాగా పట్టి అద్భుతమైన రుచి వస్తుంది. మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వండి.

మసాలాలు కలపడం: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి ముద్ద బాగా మగ్గి, నూనె పైకి తేలిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మసాలా ఫ్లేవర్ పీస్‌లకు చక్కగా పడుతుంది. నెమ్మదిగా కలుపుకోండి.

కారం, ఉప్పు కలపడం: నూనె తేలిన తర్వాత, రెండు స్పూన్ల వరకు కారం (మీ స్పైసీకి తగ్గట్టు), రుచికి సరిపడినంత కల్లుప్పు లేదా సాల్ట్ వేసుకోండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత, మరొక్క రెండు నిమిషాల పాటు కారాన్ని నూనెలో వేయించాలి. ఉప్పు, కారం పచ్చివాసన పోయి, పీస్‌లకు బాగా పట్టి రుచిని పెంచుతుంది.

నీళ్లు పోసి ఉడికించడం: ఇలా అన్ని మసాలాలు వేగిపోయిన తర్వాత, ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. చికెన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మొత్తం గ్రేవీ లాగా మారడానికి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి.

చివరకు.. కూర బాగా ఉడికి, గ్రేవీ చిక్కబడిన తర్వాత, చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఘుమఘుమలాడే రుచికరమైన చికెన్ కర్రీని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో చికెన్ కర్రీని తయారు చేస్తే చాలా టేస్టీగా ఉండటంతోపాటు నాటు కోడి స్టైల్‌లో వస్తుంది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *