Headlines

నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు | NIMS Hyderabad Cuts Deep Brain Stimulation Surgery Time to Just 1–2 Hours

నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు | NIMS Hyderabad Cuts Deep Brain Stimulation Surgery Time to Just 1–2 Hours


హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసర్జరీ విభాగం ఫంక్షనల్ న్యూరోసర్జరీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. వై. వంశీ కృష్ణ నాయకత్వంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సల వ్యవధిని 5–6 గంటల నుంచి కేవలం 1–2 గంటలకు తగ్గిస్తూ అత్యాధునిక విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకు పార్కిన్సన్స్ వ్యాధి, ఎసెన్షియల్ ట్రెమర్, డిస్టోనియా వంటి మూవ్‌మెంట్ డిజార్డర్లకు చేసే DBS శస్త్రచికిత్సల్లో రోగులు పలుగంటల పాటు మెలకువలో ఉండాల్సి వచ్చేది. దీనివల్ల శారీరక అసౌకర్యంతో పాటు మానసిక ఆందోళన, అలసట ఎదురయ్యేది.యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన నేషనల్ హాస్పిటల్ ఫర్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీలో ప్రత్యేక పరిశీలన శిక్షణ అనంతరం, నిమ్స్ న్యూరోసర్జరీ బృందం అత్యాధునిక ఇమేజింగ్, ఖచ్చితమైన శస్త్రచికిత్స ప్రణాళిక, సమర్థవంతమైన శస్త్రచికిత్సా విధానాలను సమన్వయం చేసి, ఎంపిక చేసిన రోగులకు జనరల్ అనస్థీషియా కింద అత్యంత ఖచ్చితత్వంతో కేవలం 1–2 గంటల్లోనే DBS శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది.

గత రెండున్నర సంవత్సరాలలో 200కు పైగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్, ఫంక్షనల్ న్యూరోసర్జరీలో దేశంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది.అదనంగా, మందులతో నియంత్రణలోకి రాని వణుకు సమస్యతో బాధపడుతున్న రోగులకు MRI గైడెడ్ రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సను నిమ్స్ ప్రారంభించింది. ఆధునిక MRI సీక్వెన్సుల సహాయంతో డెంటాటో–రూబ్రో–థాలామిక్ మార్గాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి చికిత్స అందిస్తున్నారు. శరీరంలో ఎలాంటి శాశ్వత పరికరాలను అమర్చాల్సిన అవసరం లేకుండా ఈ చికిత్సను విజయవంతంగా అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



ఈ చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 5 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, నిమ్స్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన పేద రోగులకు పూర్తి ఉచితంగా ఈ అత్యాధునిక చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా, న్యూరోజెనిక్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్న రోగులకు సాక్రల్ న్యూరోమాడ్యులేషన్ సేవలను కూడా నిమ్స్ ప్రారంభించింది.

నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య సంస్థలోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తూ అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం నిమ్స్ లక్ష్యమని తెలిపారు. తక్కువ సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు, వేగవంతమైన కోలుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఖరీదైన చికిత్సలను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు అందించడం నిమ్స్ ప్రత్యేకత అని అన్నారు.

ఈ శస్త్రచికిత్సలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. వై. వంశీకృష్ణ నాయకత్వంలోని వైద్య బృందాన్ని, మరియు డా. సిరీష యరీడ మరియు డా. వసుంధరలను నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ గారు అభినందించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *