దేశవ్యాప్తంగా ఉన్న యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త అందించింది. ఈ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 225 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–జనరలిస్టు పోస్టులు, 25 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–హిందీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 225 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్ కేటగిరీకి 79, ఈడబ్ల్యూఎస్‌కు 24, ఓబీసీకి 69, ఎస్సీకి 34, ఎస్టీకి 19 పోస్టులు కేటాయించారు. వీటికి అదనంగా దివ్యాంగుల కోసం 12 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరలిస్టులకు 11, హిందీ ఆఫీసర్‌కు ఒక పోస్టు ఉన్నాయి. ఈ పోస్టులను హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో భర్తీ చేస్తారు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–జనరలిస్టులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా పీజీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు పొందితే సరిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–హిందీ ఆఫీసర్ పోస్టులకు 60 శాతం మార్కులతో హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా ఇంగ్లిష్ మీడియంలో మాస్టర్స్ డిగ్రీ చేసి, హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు సరిపోతాయి. అభ్యర్ధుల వయోపరిమితి జూన్ 30, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ–ఎన్‌సీఎల్‌కు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC)లో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమ్స్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది ఎంపికలో మెయిన్స్ పరీక్షకు 75 శాతం, ఇంటర్వ్యూకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్ రైలు, బస్సు ఛార్జీలను చెల్లిస్తారు. ఎంపికైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు నెలకు రూ.82,485 నుంచి రూ.1,56,745 వరకు జీతంగా చెల్లిస్తారు. దీనితో పాటు NPS, గ్రాట్యూటీ, LTS, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్, వైద్య సదుపాయాలు వంటి ప్రయోజనాలు అందుతాయి. ఎంపికైన అభ్యర్థులు ఒక ఏడాది ప్రొబేషన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా పోస్టింగ్ ఇవ్వడంతో పాటు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 28, 2026.
- ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 22, 2026.
- మెయిన్స్ పరీక్ష: నవంబర్ 30, 2026.
యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC)లో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.