Headlines

పచ్చిమిర్చి vs ఎండుమిర్చి.. ఆరోగ్యానికి ఏది అమృతం.. ఏది విషం? ఇవి పక్కా తెలుసుకోండి.. | Green Chili vs Red Chili: Which One Is Actually Healthy for You, Check Details

పచ్చిమిర్చి vs ఎండుమిర్చి.. ఆరోగ్యానికి ఏది అమృతం.. ఏది విషం? ఇవి పక్కా తెలుసుకోండి.. | Green Chili vs Red Chili: Which One Is Actually Healthy for You, Check Details


భారతీయ వంటకాలకు మిరపకాయతో విడదీయరాని సంబంధం ఉంది. కారం లేకపోతే ఆ వంటనే పూర్తి కాదు. సాధారణంగా ప్రతి ఇంటా వంటల్లో పచ్చి మిరపకాయ, ఎండు మిరపకాయ.. ఈ రెండింటినీ ఉపయోగిస్తుంటారు. అయితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ రెండింట్లో ఏది ఎక్కువ మేలు చేస్తుంది? అసలు ఇవి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. ఆహార, పోషకాహార నిపుణుల ప్రకారం.. ఈ రెండు మిరపకాయల గుణాలు, ప్రభావాలు పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి.

పచ్చి మిరపకాయలు: పోషకాల గని..

పచ్చి మిరపకాయలు ఆహారానికి రుచిని, కారాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, ఇనుము అధిక మొత్తంలో ఉంటాయి. అధికంగా ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో యాంటీబాడీలను నిర్మించి, కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు నుండి కాపాడతాయి. పచ్చిమిర్చి తినడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి పెరిగి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని క్యాప్సైసిన్ అనే పదార్థం మెటాబాలిజాన్ని పెంచి, కేలరీలు వేగంగా కరిగేలా చేసి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పచ్చిమిర్చి తిన్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలై, ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తుంది.

ఎండు మిరపకాయలు

పచ్చి మిరపకాయలను ఎండబెట్టడం ద్వారా ఎండు మిరపకాయలు తయారవుతాయి. ఈ ప్రక్రియలో వాటిలోని నీటి శాతం తొలగిపోయి అంతర్గత రసాయన కూర్పులో మార్పులు వస్తాయి. వీటిలో క్యాప్సైసిన్ అధిక సాంద్రతలో ఉండటం వల్ల రక్త ప్రసరణ పెరిగి కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. మితంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది. వంటకానికి మంచి రంగును, ఘాటైన సువాసనను అందిస్తాయి.

ఎండు మిరపకాయలతో ఆరోగ్య ప్రమాదాలు..

పోషకాహార నిపుణుల హెచ్చరిక ప్రకారం.. పచ్చిమిర్చితో పోలిస్తే ఎండుమిర్చి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండుమిర్చిని ఎక్కువగా తినడం వల్ల కడుపు లోపలి పొరలో చికాకు ఏర్పడి గుండెల్లో మంట, అల్సర్లు, జీర్ణ సమస్యలు వస్తాయి. ఎండబెట్టే క్రమంలో పచ్చిమిర్చిలో ఉండే సున్నితమైన విటమిన్ సి దాదాపు పూర్తిగా నశిస్తుంది. మార్కెట్లో దొరికే ఎండు మిరప పొడిలో కృత్రిమ రంగులు, హానికర రసాయనాలు కలిపే అవకాశం ఉంది. ఇవి లివర్, కిడ్నీలకు తీవ్ర హాని కలిగిస్తాయి.

ఏది మంచిది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎండు మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలే నిస్సందేహంగా చాలా మంచివి. పచ్చిమిర్చిని వండినా లేదా పచ్చిగా తిన్నా క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండు మిరపకాయలను లేదా వాటి పొడిని కేవలం రుచి కోసం అప్పుడప్పుడు మాత్రమే వాడాలి తప్ప, రోజువారీ ఆహారంలో చేర్చుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా అల్సర్లు, కడుపు సమస్యలు ఉన్నవారు వీటిని దూరంగా ఉంచడమే బెటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *