Headlines

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్..! | Pakistan: Balochistan declares August 11 Independence Day, seeks global recognition

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్..! | Pakistan: Balochistan declares August 11 Independence Day, seeks global recognition


పాకిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతున్న బలూచిస్తాన్ ప్రాంతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లు ఇటీవల పేర్కొంది. స్వయం ప్రకటిత బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం తాజాగా ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు, సంఘాలు, మద్దతుదారులు ఈ రోజును జాతీయ ఐక్యతతో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అలాగే తమను స్వతంత్ర, సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.

బలూచ్ విమోచన నాయకుడు మీర్ యార్ బలూచ్ విడుదల చేసిన ప్రకటనలో, బలూచ్ ప్రజలు తమ ఇళ్లపై, దుకాణాలు, మార్కెట్లు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో స్వతంత్ర బలూచిస్తాన్ జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ చారిత్రక దినం ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ప్రకటనలో పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం నిరంతర సంఘర్షణలు, రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాలు, ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొంటోందని ఆరోపించారు. కాశ్మీర్ వివాదం, 1948లో బలూచిస్తాన్‌లో జరిగిన సైనిక చర్య, 1971లో తూర్పు పాకిస్థాన్ విభజన, సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం, 1998 చాగై అణు పరీక్షలు, సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల అనంతర పరిణామాలు వంటి పలు చారిత్రక ఘటనలను ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ విధానాల వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో అస్థిరత పెరిగిందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సమాజం బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించాలని, తమ వైఖరికి మద్దతు ఇవ్వాలని బలూచిస్తాన్ గణతంత్రం విజ్ఞప్తి చేసింది. తమ ప్రకటన ప్రకారం, సుమారు ఆరు కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను స్వతంత్ర, సార్వభౌమ దేశ ప్రజలుగా భావిస్తున్నారని పేర్కొంది. పాకిస్థాన్ ప్రస్తుత రూపంలో కొనసాగినంతకాలం ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, అభివృద్ధి సాధ్యం కాదని కూడా ఆరోపించింది.

ఆగస్టు 11 తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా ఎంచుకోవడానికి కూడా చారిత్రక కారణం ఉందని బలూచ్ నేతలు చెబుతున్నారు. బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో 1947 ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఆ ప్రకటన వార్తను అప్పట్లో అంతర్జాతీయ మీడియా సంస్థలు, అలాగే ఆల్ ఇండియా రేడియో కూడా ప్రచురించాయని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఆగస్టు 11ను తమ జాతీయ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు.

అయితే, ఈ ప్రకటనలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. బలూచిస్తాన్ అంశం ఇప్పటికే పాకిస్థాన్‌లో అత్యంత సున్నితమైన రాజకీయ, భద్రతా సమస్యగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ తాజా ప్రకటన ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు పాకిస్థాన్ ప్రతి సంవత్సరం ఆగస్టు 14న, భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *