Headlines

పొగాకు రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..! | Good news for tobacco farmers: CM Chandrababu gives green signal for increases procurement

పొగాకు రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..! | Good news for tobacco farmers: CM Chandrababu gives green signal for increases procurement


పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరీకరణ, కొనుగోళ్లకు మద్దతు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ధరల లోటు భర్తీ పథకం కింద రైతులకు కిలో పొగాకుకు రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్రం, రాష్ట్రం కలిసి మొత్తం రూ.188 కోట్లు భరించేందుకు అంగీకరించాయి.

రాష్ట్రంలో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లకు పూర్తి మద్దతు లభించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే బ్రైట్ రకం పొగాకు కిలో ధర రూ.240, మీడియం రకం రూ.190, లో గ్రేడ్ పొగాకు రూ.110 కంటే తగ్గకుండా కొనుగోళ్లు జరిగేలా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.

పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని సమీక్షించారు. సీఎం సూచనల మేరకు రాష్ట్రంలోని పొగాకు బయ్యర్లతో కేంద్ర ప్రతినిధులు సమావేశమై రైతులకు అనుకూలంగా కొనుగోళ్లపై చర్చలు జరిపారు. అనంతరం వివిధ ప్రతిపాదనలను పరిశీలించి తుది నిర్ణయానికి వచ్చారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *