Headlines

పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరీ పెట్రోలిండ్ వైహికల్ ఎత్తుకెళ్లిన మందుబాబు.. అసలేంజరిగిందంటే? | Drunk Man Steals Karimnagar Police Car from Station, Arrested After Crash


సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్నే ఎత్తుకెళ్లిన విచిత్ర ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రిజ్వి చమన్‌కు చెందిన ఇజాజ్ అనే తాగుడుకు బానిసవ్వడంతో.. భార్య పుట్టింటికి వెళ్లినట్టు సమాచారం.. అయితే తమ సమస్యను పరిష్కరించి.. భార్యను తీసుకురావాలని కోరుతూ రాత్రి సమయంలో ఇజాజ్ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులకు విషయం చెప్పి రాత్రి 11:30 వరకు అక్కడే ఉన్నాడు.

అయితే ఇంటికి వెళ్లే క్రమంలో స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్నోవా పెట్రోలింగ్ వాహనంలో తాళం చెవి ఉండటాన్ని గమనించిన ఇజాజ్, వెంటనే దాన్ని స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పోతూపోతూ మార్గమధ్యలో వాహనంలో ఉన్న వైర్‌లెస్ సెట్‌ను తీసి బయట పడేశాడు.

పెట్రోలింగ్ వాహనం చోరీకి గురైన విషయాన్ని గుర్తించిన వెంటనే ఏసీపీ విజయ్ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆదారంగా వాహనం వరంగల్ వైపు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే హుజరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి సరిహద్దు పోలీసు స్టేషన్లతో పాటు మార్గమధ్యలోని టోల్‌గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు.

అయితే వాహనం ఎత్తుకెళ్లి ఇజాజ్ మానకొండూరు మీదుగా కొత్త నేషనల్ హైవేపై వెళ్తున్న క్రమంలో, ఎల్కతుర్తి దాటిన తర్వాత రోడ్డు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వాహనం అదుపుతప్పి కిందకు జారిపడింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగులు ఓపెన్ అవ్వడంతో ఇజాజ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తర్వాత కారులోంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడి ఇతర వాహనదారులకు ట్రాఫిక్ సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు.

సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ బృందం ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుంది. క్రేన్ సహాయంతో ధ్వంసమైన ఇన్నోవా వాహనాన్ని వెలికితీసి కరీంనగర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *