Headlines

Big Bash League: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణకు ఆస్ట్రేలియా బోర్డు ఆమోదం | Australia privatises big bash league bbl ipl team owners investment


Big Bash League: ఇన్నాళ్లూ ప్రైవేట్ యాజమాన్యాలకు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. బిగ్ బాష్ లీగ్‌ను ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికా, ఇంగ్లండ్‌లోని లీగ్‌లలో ఇప్పటికే జట్లను కొనుగోలు చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆస్ట్రేలియా లీగ్‌పై కూడా దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యాయి. రిలయన్స్, రెడ్ చిల్లీస్, ఆర్‌పిఎస్‌జి, జీఎంఆర్-జెఎస్‌డబ్ల్యూ వంటి దిగ్గజ వ్యాపార సంస్థలు బీబీఎల్ జట్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏడాది పొడవునా ప్లేయర్లతో ఒప్పందాలు

ఆస్ట్రేలియా లీగ్‌లో జట్టును కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ యజమానులకు భారీ ప్రయోజనం కలగనుంది. గ్లెన్ మాక్స్‌వెల్, కేమరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ వంటి స్టార్ ఆటగాళ్లను తమ గ్లోబల్ ఫ్రాంచైజీల కింద ఏడాదంతా తమతోనే ఉంచుకునే వెసులుబాటు లభిస్తుంది. ఐపీఎల్, ఎస్‌ఎ20, ఎంఎల్‌సి, బీబీఎల్ వంటి విభిన్న లీగ్‌లలో ఒకే బ్రాండ్ కింద వీరు ఆడేలా ఒప్పందాలు చేసుకోవచ్చు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు విలువ ప్రస్తుతం 150 మిలియన్ల నుంచి 200 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పూర్తి నియంత్రణ క్రికెట్ ఆస్ట్రేలియా చేతిలోనే

ప్రైవేట్ వ్యక్తులకు జట్లను అమ్మినప్పటికీ, లీగ్ నియంత్రణను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా తన చేతుల్లోనే ఉంచుకోనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్, ఆటగాళ్ల అందుబాటు, ప్రసార హక్కులు, జీతాల పరిమితిపై క్రికెట్ బోర్డుదే తుది నిర్ణయం. భారతీయ సంస్థలకు రెండు లేదా మూడు జట్లకు మించి విక్రయించకూడదని భావిస్తోంది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టును 100 శాతం విక్రయిస్తున్నప్పటికీ, మిగిలిన జట్లలో 49 శాతం వరకు మాత్రమే ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం ఇచ్చే యోచనలో వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాలు ఉన్నాయి.

భారత ఆటగాళ్ల రాకపై సస్పెన్స్

ఐపిఎల్ యజమానులు బీబీఎల్ జట్లను కొనుగోలు చేసినప్పటికీ, పురుషుల భారత స్టార్ ఆటగాళ్లను ఆస్ట్రేలియా వేదికలపైకి వెంటనే తీసుకురావడం సాధ్యం కాదు. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు పురుషుల బోర్డు ఒప్పందంలో ఉన్న క్రీడాకారులకు బీసీసీఐ ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయితే స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి మహిళా క్రికెటర్లు ఇప్పటికే బీబీఎల్‎లో ఆడుతున్నారు. భవిష్యత్తులో రిటైర్ అయిన లేదా కాంట్రాక్ట్ లేని పురుష ఆటగాళ్లకు బీసీసీఐ మినహాయింపు ఇస్తే, ఈ లీగ్ లీగల్ వ్యాల్యూ మరింత పెరుగుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *