ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను తాత్కాలికంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించిన ఘటనపై మెటా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు సమాచారం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సమన్ల నేపథ్యంలో మెటా గ్లోబల్ బృందం బుధవారం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది.
సమావేశంలో ప్రధాని మోదీ వీడియో తొలగింపు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా వేదికలపై పెరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSEAM), ఇతర అక్రమ పోస్టులను అరికట్టడంలో ఉన్న లోపాలపై కూడా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమ ప్లాట్‌ఫారమ్‌లలో జరిగిన కార్యాచరణ లోపాలపై మెటా ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. అలాగే అక్రమ కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా సంస్థలు కేవలం మధ్యవర్తులు మాత్రమేనని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోలేవని, వినియోగదారులకు ఏ కంటెంట్‌ను చూపించాలనే విషయంలో అల్గోరిథమ్‌ల ద్వారా నిర్ణయాలు తీసుకుంటున్నందున వాటికి పూర్తి బాధ్యత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.
జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి కొంతసేపు తొలగించారు. అనంతరం దానిని పునరుద్ధరించిన మెటా, ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిందని వివరణ ఇచ్చింది. అయితే ఆ వివరణతో ప్రభుత్వం పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఇదే అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంటరీ సమాచార సాంకేతిక స్థాయీ సంఘం కూడా మెటా వివరణ కోరింది. ముఖ్యంగా మహిళలను కించపరిచే పోస్టులు, బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను వేగంగా తొలగించేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో మెటా గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కాప్లాన్‌తో పాటు సంస్థకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారతదేశం మెటాకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటంతో, దేశ చట్టాలు, నియంత్రణలను పూర్తిగా పాటించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం.