Headlines

బంతులా బుల్లెట్లా.. 5 ఓవర్లు, 0 రన్స్, 5 వికెట్లు! పాకిస్థాన్‌పై విండీస్ వీరుడి ప్రతాపం | 5 Wickets in 5 Overs and Zero Runs Justin Greaves Creates Test Cricket History with Record Five Consecutive Wicket Maidens Against Pakistan

బంతులా బుల్లెట్లా.. 5 ఓవర్లు, 0 రన్స్, 5 వికెట్లు! పాకిస్థాన్‌పై విండీస్ వీరుడి ప్రతాపం | 5 Wickets in 5 Overs and Zero Runs Justin Greaves Creates Test Cricket History with Record Five Consecutive Wicket Maidens Against Pakistan


వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ట్రినిడాడ్‌లోని టారూబాలో ఉన్న బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఐదు ఓవర్లు మెయిడెన్ వేయడంతో పాటు ఐదు వికెట్లు సాధించాడు. ఇది అద్భుతమైన రికార్డ్. మూడో రోజు ఆటలో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ బలంగా కొనసాగుతున్న సమయంలో గ్రీవ్స్ ఈ సూపర్ బౌలింగ్ చేశాడు. అప్పటికే పాకిస్థాన్ 244/3తో భారీ స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు పటిష్టమైన ఆధిక్యం అందించేలా కనిపించాడు. అయితే గ్రీవ్స్ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది.

కుడిచేతి వాటం సీమర్ అయిన గ్రీవ్స్ కేవలం 11 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. విశేషం ఏమిటంటే, అతను తీసిన ఐదు వికెట్లు కూడా వరుసగా ఐదు మెయిడెన్ ఓవర్లలో వచ్చాయి. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు సాధించడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ప్రదర్శనతో అతను 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నమోదు చేసిన వరుసగా నాలుగు వికెట్-మెయిడెన్ ఓవర్ల రికార్డును అధిగమించాడు.

గ్రీవ్స్ ధాటికి షాన్ మసూద్ తర్వాత మహమ్మద్ రిజ్వాన్, ఆమీర్ జమాల్, అలీ ఉస్మాన్, మహమ్మద్ అబ్బాస్ వంటి కీలక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో భారీ స్కోరు దిశగా సాగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలి 282 పరుగులకే ముగిసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 311 పరుగులకు ప్రతిగా పాకిస్థాన్ 29 పరుగులు వెనుకబడింది. మ్యాచ్ అనంతరం గ్రీవ్స్ మాట్లాడుతూ.. తనను బౌలింగ్‌కు పంపినప్పుడు కెప్టెన్ రోస్టన్ చేజ్ కేవలం క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని మాత్రమే సూచించారని తెలిపాడు. బంతి స్వింగ్ కావడం తనకు అనుకూలించిందని, టెస్ట్ క్రికెట్‌లో తొలి ఐదు వికెట్లు తీయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే ఇంకా జట్టుకు విజయాన్ని అందించాల్సి ఉందని పేర్కొన్నాడు.

అయితే గ్రీవ్స్ చారిత్రాత్మక ప్రదర్శన చేసినప్పటికీ మ్యాచ్‌పై వెస్టిండీస్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు బలంగా పుంజుకుని మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ను 126/7కు పరిమితం చేశారు. అయినప్పటికీ జస్టిన్ గ్రీవ్స్ బౌలింగ్ స్పెల్ ఈ టెస్టులోనే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో కూడా చిరస్థాయిగా నిలిచే ప్రదర్శనగా నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *