Headlines

బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ కోట బద్దలు.. ఓటమికి గల అసలు కారణాలపై కమల దళం ఇంటర్నల్ అసెస్‌మెంట్! | Why Prashant Kishor’s win in Bankipur bypoll in Bihar is a jolt to the BJP

బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ కోట బద్దలు.. ఓటమికి గల అసలు కారణాలపై కమల దళం ఇంటర్నల్ అసెస్‌మెంట్! | Why Prashant Kishor’s win in Bankipur bypoll in Bihar is a jolt to the BJP


బిహార్ ఉపఎన్నికలో బాంకీపూర్ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. ఆయన జనసురాజ్ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది.  1995 నుంచి ఈ స్థానంలో బీజేపీ ఎప్పుడూ ఓడిపోలేదు.  బిహార్ రాజకీయాల్లో కంచుకోటగా భావించే బాంకీపూర్ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. బీజేపీ ఊహించని ఓటమి చవిచూడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది ఎన్నికల్లో ఏకంగా 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ, ఇప్పుడు ఈ స్థానాన్ని కోల్పోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో కమల దళం పరాజయం పాలవడానికి గల అంతర్గత కారణాలపై పార్టీ అధిష్టానం లోతైన విశ్లేషణ మొదలుపెట్టింది. ఈ ఓటమిపై బీజేపీ నేతలు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

బీజేపీ ఓటమికి ప్రధాన కారణాలుగా భావిస్తున్న అంశాలు:

– RJD – పీకే (ప్రశాంత్ కిశోర్) లోపాయికారీ ఒప్పందం: ఆర్జేడీ తన కోర్ ఓట్లను ప్రశాంత్ కిశోర్ పార్టీకి బదిలీ చేయించిందని బీజేపీ అంచనా వేస్తోంది. బీజేపీకి పట్టున్న అగ్రవర్ణ ఓట్లలో చీలిక తెచ్చేందుకే ఆర్జేడీ ఈ వ్యూహం పన్నిందని భావిస్తోంది. తేజస్వీ యాదవ్ కేవలం ఒక గంట మాత్రమే ప్రచారం చేయడం వెనుక మర్మం ఇదేనని చెబుతోంది.

– అభ్యర్థి మార్పు ప్రభావం: మూడు దశాబ్దాలకు పైగా నితిన్ నబీన్ కుటుంబం ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తోంది. తండ్రి మరణం అనంతరం ఉప-ఎన్నికల్లో పోటీ చేసిన నితిన్ నబీన్, అప్పటి నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో అక్కడ అభ్యర్థి మార్పు అనివార్యంగా మారింది. ఈ మార్పు ఓటర్లపై ప్రభావం చూపిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

– వ్యతిరేకత, నిరసనలు: నీట్ పేపర్ లీక్ అంశంపై ఆందోళనలు, UGC మార్గదర్శకాలు, భరత్ తివారీ ఎన్‌కౌంటర్ వంటి పరిణామాల పట్ల బీజేపీ ప్రధాన కోర్ ఓటర్ల వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది కూడా ప్రతికూల ప్రభావం చూపిందని పార్టీ భావిస్తోంది.

– ఓటర్ల ఉదాసీనత: “ఇది కేవలం ఒక స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక మాత్రమే, దీనివల్ల బిహార్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు” అనే భావనలో ఓటర్లు ఉండటంతో.. పోలింగ్ సరళిపై ఆ ప్రభావం పడింది. అందుకే పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదైంది. ఇది బీజేపీ కొంపముంచింది.

బూత్ వారీగా లోతుగా సమీక్ష

ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఎక్కడెక్కడ నుంచి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే దానిపై బూత్ వారీగా విశ్లేషణ జరపాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ కోర్ ఓటర్లు ఎందుకు దూరమయ్యారు, ఏయే వర్గాలు చేజారాయి అనే దానిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కమల దళం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *