Headlines

భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos

భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos


రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పలు రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో నమోదైంది. అక్కడ 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 4 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మొహమ్మద్‌నగర్ మండలం మొగ్దంపూర్‌లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో కూడా మంచి వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం బుధవారం నాటికి దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఆయా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. గురువారం, శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నాలాల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *