Headlines

మరో ఎలక్ట్రిక్‌ కారుతో మార్కెట్‌లోకి వచ్చేస్తున్న మారుతి..! కొత్త మోడల్ సీక్రెట్స్‌ ఇవేనా | Maruti Suzuki’s Next Big Move: Launching Second Electric Car in India

మరో ఎలక్ట్రిక్‌ కారుతో మార్కెట్‌లోకి వచ్చేస్తున్న మారుతి..! కొత్త మోడల్ సీక్రెట్స్‌ ఇవేనా | Maruti Suzuki’s Next Big Move: Launching Second Electric Car in India


ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు మారుతి సుజుకి వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో వేదికగా తన రెండో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. సామాన్యులను ఆకట్టుకునేలా రానున్న ఆ కొత్త కారు విశేషాలు తెలుసుకుందాం.

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి తన దూకుడును మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇ-విటారాతో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన కంపెనీ, ఇప్పుడు వచ్చే ఏడాది తన రెండో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. 2027 భారత్ మొబిలిటీ ఎక్స్‌పో వేదికగా ఈ కొత్త మోడల్‌ను ప్రదర్శించే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

భారీ అంచనాలు..

కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ కారు ఏ మోడల్ ఆధారంగా తయారవుతుందనే విషయాన్ని మారుతి సుజుకి ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతం ఈ కొత్త ఈవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో ప్రధానంగా ఎర్టిగా ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ ఎంపీవీ పేరు ప్రముఖంగా చర్చకు వస్తోంది. ఈ మూడు వరుసల ఎలక్ట్రిక్ వాహనం ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షల్లో కనిపించింది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎంపీవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో మారుతి ఈ విభాగంలోకి రావడం కంపెనీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. మారుతి ఎర్టిగా ఈవీని సరసమైన ధరలో తీసుకొస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎంపీవీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చు. ముఖ్యంగా కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ కంటే తక్కువ ధర ఉంటే, దేశంలోనే అత్యంత చౌకైన మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎంపీవీగా నిలిచే అవకాశం ఉంది.

ఎస్‌యూవీ ఆప్షన్లు

అటు బ్రెజ్జా లేదంటే ఫ్రాంక్స్ ఆధారంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావచ్చనే అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రెజ్జా ఈవీ లేదా ఫ్రాంక్స్ ఈవీని తీసుకురావడం మారుతికి వ్యూహాత్మకంగా ఉపయోగపడొచ్చు. నాలుగు మీటర్ల లోపు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, కియా సైరోస్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ లాంటి మోడళ్లు పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఫ్రాంక్స్ ఈవీ మార్కెట్లోకి వస్తే టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ eC3 వంటి మోడళ్లకు కూడా పోటీ పెరిగే అవకాశం ఉంది.

భారత మార్కెట్ కోసం మొత్తం ఎనిమిది ఎస్‌యూవీలతో కూడిన పెద్ద పోర్ట్‌ఫోలియోపై పని చేస్తున్నట్లు మారుతి ఇప్పటికే వెల్లడించింది. ఇందులో తొలి మోడల్‌గా విక్టోరిస్ మార్కెట్లోకి వచ్చింది. మిగిలిన మోడళ్లను 2030 నాటికి దశలవారీగా తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక మారుతి తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా ఇ-విటారాను ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. మూడు వేరియంట్లు, పది రంగులు, రెండు బ్యాటరీ ఎంపికలతో ఇ-విటారా అందుబాటులో ఉంది. మారుతి రెండో ఎలక్ట్రిక్ కారుగా ఎర్టిగా, బ్రెజ్జా, ఫ్రాంక్స్‌లో ఏ మోడల్‌ను ఎంచుకుంటుందనే దానిపై ప్రస్తుతం తీవ్ర ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *