పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సోమవారం అనూహ్యంగా మూసివేశారు. హిందూ సంస్థ బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS)కు చెందిన ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను వారి పని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచారనే ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది నిరసనకు దిగినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఉద్యోగులు వాకౌట్ చేయడంతో ఈఫిల్ టవర్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అసాధారణ పరిస్థితుల కారణంగా సందర్శకులకు ప్రవేశం నిలిపివేసినట్లు ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ SETE వెల్లడించింది.
మహిళా సిబ్బంది ఆరోపణలు
తాజాగా ఫ్రాన్స్‌లో కొత్త హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన BAPSకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులు శనివారం ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. ఈ సమయంలో సమయంలో మహిళా ఉద్యోగులను వారి సాధారణ విధుల నుంచి తప్పించి, ప్రతినిధి బృందం వెళ్లే సమయంలో వారు కనిపించకుండా ఏర్పాట్లు చేసినట్లు యూనియన్ ప్రతినిధి డయాన్ డవోయిన్ ఆరోపించారు. మహిళలను వారి లింగం కారణంగా విధుల నుంచి తప్పించడం పట్ల ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై SETE కూడా స్పందించింది. పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందితో సంభాషణలను పరిమితం చేయాలని బృందం నుంచి అభ్యర్థన వచ్చినట్లు సంస్థ అంగీకరించింది. అయితే ఇలాంటి షరతులను అంగీకరించకుండా ఉండాల్సిందని కూడా SETE స్పష్టం చేసింది.
BAPS క్షమాపణలు
ఈ వివాదంపై పారిస్‌లోని BAPS హిందూ దేవాలయం స్పందిస్తూ.. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. తమ పర్యటన వల్ల ఎవరికైనా బాధ లేదా అసౌకర్యం కలిగితే క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రతినిధులు రావడంతో ఇతరులకు ఇబ్బంది కలగకుండా సాధారణ పనివేళలు ప్రారంభమైన సమయంలోనే పర్యటనను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అయితే ఈఫిల్ టవర్‌లో ఎవరినీ ప్రవేశించకుండా నిరోధించలేదని కూడా పేర్కొంది.
ఫ్రాన్స్‌లో రాజకీయ దుమారం
ఈ ఘటనపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ తీవ్రంగా స్పందించారు. మహిళలను, పురుషులను లింగం ఆధారంగా వేరు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ దర్యాప్తు చేపడతామని తెలిపారు. జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాఎల్ బ్రాన్-పివెట్ కూడా ఘటనను ఖండించారు. విదేశీ సందర్శకుల డిమాండ్ల కోసం మహిళలను పక్కకు తప్పించరాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు ఒక్కరోజు ముందే పారిస్‌లో BAPSకు చెందిన కొత్త స్వామినారాయణ ఆలయం ప్రారంభమైంది.