Headlines

మీ ఎముకలు ఇనుప సువ్వల్లా మారాలా..? అయితే, వీటిని మస్ట్‌గా తినండి.. | Healthy Strong Bones Diet: Essential Nutrient Rich Foods for Optimal Bone Health


మనిషి శరీర నిర్మాణానికి, కదలికలకు ఎముకలు పునాది. బలమైన ఎముకలు ఆరోగ్యకరమైన జీవితానికి అత్యవసరం. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాల్షియం, విటమిన్ డితో కూడిన ఆహారాలు తీసుకోవడం ప్రధానం. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, అలాగే వృద్ధులకు బోన్ డెన్సిటీ తగ్గడం సాధారణం. చిన్న పిల్లల ఎదుగుదలకు కూడా ఈ పోషకాలు ఎంతో అవసరం. ఈ ఆహార పదార్థాలను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు.

పాలు – పాల పదార్థాలు:

స్థానికంగా లభించే పాల ఉత్పత్తులు కాల్షియం, విటమిన్ డికి అద్భుతమైన వనరులు. పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, చీజ్, బటర్ వంటివి నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. వీటిని నేరుగా లేదా ఇతర వంటకాల రూపంలో తీసుకోవచ్చు. ఉదాహరణకు, పాలతో చేసిన పన్నీర్‌ను కర్రీస్‌లో, పెరుగును సలాడ్‌లలో లేదా మజ్జిగను పానీయంగా తీసుకోవచ్చు.

ఆకుకూరలు:

పచ్చి ఆకుకూరలు కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలకు నిలయం. ముఖ్యంగా పొన్నగంటి కూర, తోటకూరలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా, అన్ని రకాల ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. పచ్చి కూరగాయలను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ డి కూడా అందుతుంది.

నట్స్ – సీడ్స్:

బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్ (పొద్దుతిరుగుడు విత్తనాలు) వంటి నట్స్, సీడ్స్‌లో విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగలు (పల్లి) కూడా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డిలకు మంచి వనరు. వీటిని స్నాక్స్‌గా లేదా సలాడ్‌లలో చేర్చుకొని తీసుకోవచ్చు. నిత్యం వీటిని తినడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది.

పప్పులు – సోయా ఉత్పత్తులు:

పప్పులు, సోయాబీన్, సోయా చంక్స్, టోఫు వంటివి కాల్షియం, ప్రోటీన్లకు మంచి వనరులు. కందిపప్పు, మినప్పప్పు వంటి పప్పుల్లో విటమిన్ డి, కాల్షియం లభిస్తాయి. పిల్లలకు మినప వడలు వంటి రుచికరమైన రూపాల్లో అందించవచ్చు. మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకుంటే కాల్షియం, విటమిన్ డి తప్పకుండా లభిస్తాయి. కర్రీస్‌లో సోయాబీన్ లేదా సోయా చంక్స్ చేర్చడం వల్ల పోషక విలువలు పెరుగుతాయి.

చేపలు:

చేపలు విటమిన్ డికి అద్భుతమైన మూలం. సాల్మన్, సార్డిన్స్ వంటి చేపలతో పాటు, స్థానికంగా లభించే బంగారు చేపలలో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది. భారతీయ ఆహార పద్ధతుల్లో చేపల వినియోగం తక్కువ కాబట్టి, వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఒక ముక్క చేప అయినా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.

పుట్టగొడుగులు (మష్రూమ్స్):

పుట్టగొడుగులు, ముఖ్యంగా బటన్ మష్రూమ్స్, షిటేక్ మష్రూమ్స్ విటమిన్ డికి మంచి వనరులు. ఈ పుట్టగొడుగులను ఎండలో ఉంచడం ద్వారా వాటిలోని విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. వారంలో రెండు సార్లు వీటిని ఆహారంలో తీసుకోవడం ఎముకలకు మేలు చేస్తుంది.

సహజ వనరులు – సప్లిమెంట్స్:

ఆహారంతో పాటు, విటమిన్ డికి అత్యంత సహజమైన, ఉత్తమ వనరు సూర్యరశ్మి. ప్రతిరోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం వల్ల శరీరం తగినంత విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. చేతులు, కాళ్లు సూర్యరశ్మికి గురయ్యేలా చూసుకోవాలి. ఎముకల సాంద్రత తక్కువగా ఉన్నవారు లేదా విటమిన్ డి లోపం తీవ్రంగా ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయితే, సప్లిమెంట్స్‌తో పాటు ఆహారంపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

సమతుల్య ఆహారం, తగినంత సూర్యరశ్మి ద్వారా బలమైన ఎముకలతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *