Headlines

విధి నిర్వహణలోనే విషాదం.. చెక్‌పోస్ట్‌కు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్‌ ఆకస్మిక మృతి | Medak head constable anandam duty death telangana police tragedy


Head Constable Anandam News: విధి నిర్వహణలో ఉండగానే ఓ హెడ్ కానిస్టేబుల్‌ ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఛాతినొప్పితో అస్వస్థతకు గురైన హెడ్ కానిస్టేబుల్‌ ఆనందం (54) చికిత్స పొందుతూ మృతి చెందారు. మెదక్‌ జిల్లా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్టీలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనందం.. మంగళవారం చెక్‌పోస్ట్‌ విధుల కోసం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయనకు ఛాతినొప్పి రావడంతో తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు ఈసీజీ నిర్వహిస్తుండగా ఆనందం ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వెంటనే సీపీఆర్‌ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్‌లోని మెడినోవా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి ఆనందం మృతి చెందినట్లు నిర్ధారించారు.

సహచరులకు ఆత్మీయుడు..

ఆనందం సహచరులతో ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవారని తోటి పోలీసులు తెలిపారు. విధుల్లో చురుగ్గా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణ వార్త తెలుసుకున్న సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనందం అంత్యక్రియలను బుధవారం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది హాజరై ఆనందానికి తుది వీడ్కోలు పలకనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *