Headlines

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..! | GrapheneOS on Android Phone Lands US Man in Legal Trouble After Airport Search

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..! | GrapheneOS on Android Phone Lands US Man in Legal Trouble After Airport Search


మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో గోప్యత కోసం వేరే ఆండ్రాయిడ్ ఓఎస్ ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీ కోసమే..! గోప్యత, డేటా భద్రత కోసం ప్రత్యేక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ప్రస్తుతం గ్రాఫేన్ ఓఎస్ (GrapheneOS)పై చర్చ మొదలైంది. అమెరికాలో విమానాశ్రయ తనిఖీ సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌లోని డేటా పూర్తిగా తొలగిపోవడంతో అతడిని అరెస్టు చేసిన ఘటన ఈ వివాదానికి కారణమైంది. ఫోన్‌లో గ్రాఫేన్ ఓఎస్ ఉండటం, అందులోని భద్రతా ఫీచర్ల కారణంగానే ఈ వ్యవహారం న్యాయపరమైన వివాదంగా మారింది.

డొమినికన్ రిపబ్లిక్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగి వచ్చిన శామ్యూల్ ట్యూనిక్ అనే వ్యక్తిని జనవరి 24న అట్లాంటాలోని హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు తనిఖీ చేశారు. విచారణ సమయంలో అధికారులు అతని ఫోన్‌ను అన్‌లాక్ చేయాలని కోరారు. ఫోన్ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన తర్వాత ట్యూనిక్ పాస్‌కోడ్ నమోదు చేశాడు. అయితే, ఆ తర్వాత ఫోన్ స్క్రీన్ మెరుస్తూ రీస్టార్ట్ కావడంతో పాటు, అందులోని డేటా మొత్తం తొలగిపోయిందని అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు స్పందిస్తూ, సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఫోన్ డేటాను తొలగించారని ఆరోపించారు. అందుకే ట్యూనిక్‌ను అరెస్టు చేశారు. మరోవైపు, ట్యూనిక్ తరఫు న్యాయవాదులు మాత్రం ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన గ్రాఫేన్ ఓఎస్‌లో ఉన్న సాధారణ భద్రతా ఫీచర్ కారణంగా డేటా తొలగిపోయిందని వాదిస్తున్నారు. అలాగే ఫోన్‌ను తనిఖీ చేసే అధికారుల చర్యలు రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని వారు పేర్కొంటున్నారు.

గ్రాఫేన్ ఓఎస్ అంటే ఏమిటి?

గ్రాఫేన్ ఓఎస్ అనేది గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కోసం రూపొందించిన కస్టమ్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వినియోగదారుల గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. సాధారణ ఆండ్రాయిడ్ కంటే మెరుగైన ఎన్‌క్రిప్షన్, యాప్ నియంత్రణలు, డేటా రక్షణ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇందులోని కొన్ని భద్రతా ఎంపికలు వినియోగదారుల డేటాను అనధికారిక యాక్సెస్ నుంచి రక్షించేందుకు రూపొందించారు. ఈ ఓఎస్‌లో నిర్దిష్ట పాస్‌కోడ్ ద్వారా ఫోన్‌లోని మొత్తం డేటాను తొలగించే సౌకర్యం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఫీచర్‌ను నేరపూరిత ఉద్దేశాలకు ఉపయోగించారా లేదా సాధారణ భద్రతా చర్యగా పనిచేసిందా అనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది.

గ్రాఫేన్ ఓఎస్ కంపెనీ వివరణ

గ్రాఫేన్ ఓఎస్ సంస్థ తమ ఆపరేటింగ్ సిస్టమ్ పూర్తిగా చట్టబద్ధమైనదని స్పష్టం చేసింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక ప్రాప్యత నుంచి రక్షించడమే తమ లక్ష్యమని పేర్కొంది. బలమైన ఎన్‌క్రిప్షన్, భద్రతా వ్యవస్థలు కలిగి ఉండటం వల్ల వినియోగదారులు తమ డేటాపై మరింత నియంత్రణ పొందుతారని తెలిపింది. డిఫాల్ట్ సెట్టింగ్స్ ప్రకారం, ఫోన్ ఎక్కువ సమయం అన్‌లాక్ చేయకుండా ఉంటే అది తిరిగి సురక్షిత స్థితిలోకి వెళ్తుందని సంస్థ వివరించింది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ భద్రతా సమయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

సైబర్ నిపుణుల ఆందోళన

ఈ కేసు సైబర్ భద్రతా రంగంలో కొత్త చర్చకు దారితీసింది. గ్రాఫేన్ ఓఎస్‌ను ఉపయోగించడం మాత్రమే అనుమానాస్పద చర్యగా పరిగణించే పరిస్థితి వస్తే, గోప్యతా హక్కులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ భద్రతా, నిఘా నిపుణులు ఈ కేసు భవిష్యత్తులో ప్రైవసీ టెక్నాలజీలపై చట్టపరమైన దృష్టికోణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం ట్యూనిక్ తరఫు న్యాయవాదులు కేసును కొట్టివేయాలని, ఫోన్‌కు సంబంధించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకూడదని కోర్టును కోరుతున్నారు. ఫోన్ భద్రతా ఫీచర్ ఒక నేర సాధనమా లేదా వ్యక్తిగత గోప్యత రక్షణ చర్యా అన్న ప్రశ్నకు ఈ కేసు సమాధానం ఇవ్వనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *