అమరావతి, ఆగస్ట్ 4: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు బుధవారం (ఆగస్టు 5) నుంచి ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు విడతల్లో జరుగుతాయి. ఆగస్ట్ 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రేపట్నుంచి మొదలయ్యేది స్పెషల్ టెట్ పరీక్షలు. అంటే సర్వీసులో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు మాత్రమే నిర్వహించే పరీక్షలన్నమాట. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో స్పష్టంగా లేకపోతే, ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు లేదా బ్యాంక్ పాస్‌బుక్ వంటి గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకురావాలని తెలిపారు.
వికలాంగ అభ్యర్థులకు సూచనలు
పీహెచ్సీ (దివ్యాంగ) అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ వివరాలను పీహెచ్సీగా నమోదు చేయకపోతే, జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి తీసుకుని సహాయకుడి (స్క్రైబ్) సదుపాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని అభ్యర్థులను హెచ్చరించారు. పరీక్ష నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన సందేహాలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 93980 44628 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించి, అవసరమైన పత్రాలతో ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది.
ఇవి కూడా చదవండి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ రద్దు చేయాలని, దానిని రద్దు చేసేలోపు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు మరోమారు టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక టీచర్లకు ఏపీ సర్కార్ యేటా రెండు సార్లు స్పెషల్ టెట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.