Headlines

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి | Singer Nisar Wayanad dies at 44 in Dubai after high fever


గత నెల ఓ సంగీత కచేరీ కోసం దుబాయ్‌కి వచ్చిన నిసార్ వాయనాడ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. దుబాయ్, సౌదీ అరేబియాలో పలు సంగీత కార్యక్రమాల్లో వరుసగా  పాల్గొనాల్సి రావడం, మలయాళ చిత్రాల్లో పాటలు పాడేందుకు ఒప్పందం చేసుకోవడంతో బిజీగా మారారు. నెల రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నిసార్.. సాధారణ పారాసిటమాల్ మాత్రలతోనే సరిపెట్టుకున్నట్లు తెలిసింది. పరిస్థితి  విషమించడంతో శనివారం దుబాయ్‌లోని  ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. రక్తంలో తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడం (సెప్టిసీమియా) వల్ల ప్రధాన అవయవాలు విఫలమై, శరీరంలో అసిడోసిస్ పెరగడం వల్లే ఆయన మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేసారు.

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ గొంతును పోలిన స్వరం ఆయన సొంతం కావడంతో, లైవ్ స్టేజ్ షోలపై నిసార్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఉదిత్ నారాయణ్ పట్ల తన అభిమానాన్ని నిసార్ ఎప్పుడూ దాచుకోలేదు. ప్రముఖ గాయకుడు తనపై ఎంతగా ప్రభావం చూపారో అతని గత సోషల్ మీడియా పోస్ట్ తెలియచేస్తోంది.

కల నెరవేరిన వేళ

“నేను ఇన్ని సంవత్సరాలుగా కన్న కల ఎట్టకేలకు నిజమైంది. ఉదిత్ నారాయణ్ పాటలంటే నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. నాకు తెలిసినప్పటి నుంచి నేను ఆయనకు వీరాభిమానిని. ఈ క్షణం కోసం నేను 20 ఏళ్లు ఎదురుచూశాను.” ఇరవై ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఉదిత్ నారాయణ్‌ను ఎట్టకేలకు కలిసిన క్షణాలను గుర్తుచేసుకుంటూ నిసార్ సోషల్ మీడియా పోస్టులో ఇలా రాసుకొచ్చారు.

అతని మరణవార్త తెలిసిన వెంటనే వందలాది మంది అభిమానులు, మిత్రులు తుది వీడ్కోలు పలికేందుకు ఆసుపత్రికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 4 గంటల్లోనే రాత్రి 3 గంటల ప్రాంతంలో జనాజా ప్రార్థనలు పూర్తి చేసి, పార్థివ దేహాన్ని కేరళలోని అతని  స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

కేరళలోని వయడ్ జిల్లాకు చెందిన నిస్సార్ అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. దుబాయ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాటలు పాడటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  హిందీ, మలయాళ పాటలతో పాటు ఉదిత్ నారాయణ్, అరిజిత్ సింగ్, అతిఫ్ అస్లామ్ గీతాలను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించేవారు. నిసార్‌కు భార్య షహానా నిసార్, ఇద్దరు కుమార్తెలు సింబ్రీనా, అంబ్రీనా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *